జెడ్పీ ఉన్నత పాఠశాల భవనంపై దారుణం
నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన ఘటన
గూడూరు: ఓ యువకుడిని గొంతు, మర్మాంగం కోసి హత్య చేసిన దారుణ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరులో శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన షాహూల్(21) తండ్రి మృతి చెందగా, తల్లి బతుకుదెరువు నిమిత్తం కువైట్‌కు వెళ్లింది. దీంతో షాహూల్ తన అన్నతో కలిసి ఉంటూ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న షాహూల్ శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిద్దెపైకి వెళ్లి మద్యం తాగాడు.
శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు మిద్దెపైన రక్తపు మడుగులో పడిఉన్న షాహూల్ చూసి భయంతో కేకేలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. దీంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా షాహూల్ దారుణంగా హత్యకు గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలు సేకరిస్తున్నారు. వారు అందించే నివేదిక ఆధారంగా కేసు విచారణ చేపడతామని గూడూరు రూరల్ సీఐ కిశోర్‌బాబు తెలిపారు.
మృతదేహం పంచనామా చేసే క్రమంలో పోలీసులకు నిర్ఘాంతపోయే విషయం తెలిసింది. మృతుడి మర్మాంగం కోసి అతని జేబులోనే పెట్టినట్లు గుర్తించారు. ఈ ఘటన జరిగిన తీరు చూస్తే వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణంగా హత్య చేసినట్లు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ హత్యోదంతంతో విద్యార్థులు ఎక్కడ భయాందోళనలకు గురవుతారోనని పాఠశాలకు సెలవు ప్రకటించారు.
ప్రియురాలి కూతురిపై కన్నేసిన ప్రియుడు
మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు
అనంతపురం సెంట్రల్: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. ఆమె కూతురిపైనా కన్నేశాడు. బలాత్కారం చేసేందుకు యత్నించగా యువతి తల్లి అతని మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ స్థానిక డ్రైవర్స్ కాలనీలో నివాసముంటున్న ఓ మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆ మహిళ కుమార్తెపైనా కన్నేశాడు. ఈ విషయాన్ని బాలిక పలుమార్లు తల్లికి చెప్పింది. దీంతో ఆమె తన కుమార్తె జోలికి వెళ్లొద్దని ప్రియుడిని హెచ్చరించింది. అయినా అతను పద్ధతి మార్చుకోలేదు.
శుక్రవారం సురేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత మహిళ బాత్‌రూంకు వెళ్లిన సమయంలో ఆమె కుమార్తెను బలాత్కారం చేసేందుకు యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో తల్లి పరుగున వచ్చి అడ్డుకోబోయింది. అయినప్పటికీ అతను విరమించుకోకపోవడంతో కత్తితో మర్మాంగంపై దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సదరు వ్యక్తి కుప్పకూలిపోయాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి, స్థానికుల సాయంతో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉంది. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని అనంతపురం వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.


