లా నేస్తం పేరును న్యాయమిత్రగా మార్చారు.. అమలు మరిచారు
న్యాయవాదుల సంఘం ఐలూ నాయకుల విమర్శలు
విజయవాడ ధర్నాచౌక్ వద్ద న్యాయవాదుల మహాధర్నా
రక్షణ చట్టాన్ని తేవడంతో సహా అపరిష్కృత సమస్యల పరిష్కారానికి డిమాండ్
విజయవాడ లీగల్: న్యాయవాదుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడ ధర్నాచౌక్‌లో మహాధర్నా జరిగింది. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని, స్టైపెండ్ బకాయిలు చెల్లించాలనే నినాదాలతో ధర్నా చౌక్ ప్రాంతం దద్దరిల్లింది. ఐలూ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘న్యాయవాదులను పబ్లిక్ సర్వెంట్లుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలి.
గత ప్రభుత్వం వైఎస్సార్ లా నేస్తం పేరుతో పథకాన్ని ప్రారంభించి జూనియర్ న్యాయవాదులు వృత్తిలో స్థిరపడటానికి రూ.5 వేలు స్టైపెండ్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఆ పథకం పేరును న్యాయమిత్రగా మార్చింది. ఇంతవరకు జూనియర్ న్యాయవాదులకు ఎటువంటి స్టైపెండ్ ఇవ్వలేదు. ఎన్నికల వాగ్ధానంలో హామీ ఇచ్చిన విధంగా నెలకు రూ.10 వేలు స్టైపెండ్‌ను, పాత బకాయిలతో సహా వెంటనే విడుదల చేయాలి. అర్హులైన న్యాయవాద కుటుంబాలకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఐలూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దిగుబాటి రాజగోపాల్, రాష్ట్ర అధ్యక్షుడు కెంగర కుమార్, ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు తదితరులు మాట్లాడారు.


