శ్రీశైలం ప్రాజెక్టులో 842.3 అడుగులకు చేరిన నీటిమట్టం
అయినా మల్యాల పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయని రాష్ట్ర ప్రభుత్వం.. తీవ్ర వర్షాభావంతో రాయలసీమ జిల్లాల్లో తాగునీటికీ ఇబ్బందులు
821 అడుగుల నుంచే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తున్న తెలంగాణ
జూరాల నుంచి కుడి, ఎడమ కాలువలు, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా తెలంగాణకు నీటి తరలింపు
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ప్రవాహం, నీటి లభ్యతపై అధికారుల ఆందోళన
సాక్షి, అమరావతి: కళ్లెదుట కృష్ణమ్మ బిరబిరా కదలివస్తున్నా రాయలసీమలో గుక్కెడు తాగునీళ్లు దొరక్క ప్రజలు కన్నీటిపర్యంతమవుతున్నారు. అయినా చంద్రబాబు సర్కారుకు ఏమాత్రం పట్టడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 838 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు మల్యాల.. 798 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు ముచ్చుమర్రి పంప్‌హౌస్ నుంచి హంద్రీ–నీవా కాలువలోకి నీటిని ఎత్తిపోయవచ్చు.
తెలంగాణ సర్కారు తరలిస్తున్నా..
తెలంగాణ సర్కారు శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరక ముందునుంచే (గత నెల 25న 821 అడుగుల్లో 41.46 టీఎంసీల నీటి నిల్వ ఉన్నప్పటి నుంచే) కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా రోజుకు 1,600 క్యూసెక్కులు తరలిస్తోంది. ఎగువ నుంచి జూరాలకు వరద ప్రవాహం చేరకముందే కుడి, ఎడమ కాలువలు, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా నీటిని తోడేయడాన్ని ప్రారంభించిన తెలంగాణ సర్కారు.. ఇటీవల మరింత ఉధృతం చేసింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 842.3 అడుగులకు చేరుకున్నప్పటికీ.. ప్రాజెక్టులోకి 1.28 లక్షల ప్రవాహం చేరుతున్నప్పటికీ మల్యాల పంప్‌హౌస్ నుంచి హంద్రీ–నీవా కాలువలోకి నీటిని ఎత్తిపోయకుండా చంద్రబాబు సర్కార్ మీనవేషాలు లెక్కిస్తుండటంపై సాగునీటిరంగ నిపుణులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం నీటిమట్టం 841 అడుగులు దాటగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు కనిష్ట స్థాయిలో నీటిని విడుదల చేయవచ్చు. నీటిమట్టం 842.3 అడుగులకు చేరుకున్నా సరే చంద్రబాబు సర్కారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయడం లేదు.
248 రోజుల్లో తరలించింది 52 టీఎంసీలే
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంఎసీలు తరలించి రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది దాహార్తి తీర్చే లక్ష్యంతో 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. వాతావరణంలో మార్పుల వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే రోజులు తగ్గాయి. వరద వచ్చినప్పుడు ఒకేసారి భారీగా వస్తోంది. ఈ నేపథ్యంలో వరద నీటిని ఒడిసిపట్టేందుకు హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ పనులు చేపట్టేందుకు రూ.6,182.20 కోట్లతో 2021 జూన్ 7న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది.
చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేశారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కుల స్థాయిలో కొనసాగిస్తూనే.. రెండో దశలో ప్రధాన కాలువకు లైనింగ్ పనులు చేపట్టి వాటిని అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. నాసిరకంగా పనులు చేయడంతో సిమెంటు కాంక్రీట్ కొట్టుకుపోయింది. గతేడాది 248 రోజుల్లో 52.023 టీఎంసీలు తరలించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన రోజుకు సగటున 2,427.46 క్యూసెక్కులను మాత్రమే తరలించినట్లు తేలింది.
చంద్రబాబు సర్కారు గొప్పగా ప్రకటించినట్లుగా రోజుకు 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి ఉంటే 248 రోజుల్లో హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు 82.50 టీఎంసీలు సరఫరా అయ్యేవని నిపుణులు లెక్కలు వేస్తున్నారు. కానీ, 2019–24 మధ్య కాలువను వెడల్పు చేయకున్నా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రోజుకు గరిష్టంగా 2,850 క్యూసెక్కులను తరలించింది. దీన్నిబట్టి చూస్తే.. ప్రధాన కాలువను వెడల్పు చేసే పేరుతో కాంట్రాక్టర్లు, ముఖ్యనేతలు కలిసి భారీఎత్తున నిధులను దోచేశారంటూ ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.
మేల్కొనకపోతే తీవ్ర ఇబ్బందులే
వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది శ్రీశైలానికి వరద ప్రవాహం చేరడంలో తీవ్ర జాప్యం జరిగింది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలవుతున్నా ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం కనీస స్థాయి 854 అడుగులకు చేరలేదు. కృష్ణా బేసిన్‌లో ఆగస్ట్, సెపె్టంబర్ నెలల్లోనే వర్షాలు కురుస్తాయి. ఈ రెండు నెలల్లో ఏమాత్రం వర్షాలు కురుస్తాయి.. ఎన్ని రోజులు శ్రీశైలానికి వరద వస్తుందన్నది సాగునీటిరంగ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. అంటే.. ఈ ఏడాది శ్రీశైలంలో నీటిలభ్యత కనిష్టస్థాయిలో ఉంటుందనే విషయం స్పష్టమవుతోంది.
గతేడాది తరహాలో 248 రోజులు ఎత్తిపోసేందుకు శ్రీశైలంలో నీటిలభ్యత ఉండదు. హంద్రీ–నీవా కాలువలోకి పూర్తి సామర్థ్యం మేరకు ఎత్తిపోసినా నాలుగు రోజుల్లో ఒక టీఎంసీని మాత్రమే తరలించడానికి సాధ్యమవుతుంది. కానీ.. ఈ ఏడాది హంద్రీ–నీవా ద్వారా గరిష్టంగా 2,500 క్యూసెక్కులకు మించి తరలించే పరిస్థితి లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే మల్యాల పంప్‌హౌస్ నుంచి హంద్రీ–నీవా కాలువలోకి నీటిని ఎత్తిపోయడం ప్రారంభించకపోతే.. తీవ్ర వర్షాభావంతో కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.


