ఇండోర్: మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సుదీర్ఘకాలం తర్వాత ఓ కుటుంబంలో ఆడపిల్ల జన్మించడంతో ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి. ఏకంగా 52 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబంలో పసిపాప కేరింతలు వినిపించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇండోర్ కు చెందిన ముస్కాన్ అగర్వాల్ దంపతులకు ఇటీవల పసిపాప జన్మించింది. అయితే, ఈ జననం సాధారణమైనది కాదు.
ఆ కుటుంబంలో గత 52 సంవత్సరాలుగా కేవలం మగ సంతానం మాత్రమే పుడుతూ వస్తోంది. ఐదు దశాబ్దాలకు పైగా ఆ కుటుంబంలో ఒక్క ఆడపిల్ల కూడా జన్మించలేదు. దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా సాగిన ఈ సుదీర్ఘ నిరీక్షణకు తాజాగా తెరపడింది. తమ ఇంట్లో నూతన అతిథిగా మహాలక్ష్మి ప్రవేశించడంతో ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచిన డాక్టర్ బేలా షా జైన్ ఈ భావోద్వేగ క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి పసిపాపను బయటకు తీసుకొచ్చిన క్షణంలో కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందభాష్పాలు రాలినట్లు ఆమె తెలిపారు.
‘కొన్నిసార్లు అద్భుతాలు జరగడానికి తరాలే పడతాయి" అంటూ ఆమె ఈ సంఘటనపై హృదయాలను హత్తుకునే వ్యాఖ్యలు రాశారు. 52 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కుటుంబంలో తొలిసారిగా ఆడపిల్ల పుట్టడంతో ఇండోర్ లోని ఆ ఆస్పత్రి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవజాత శిశువు తల్లి ముస్కాన్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ అద్భుతమైన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన డాక్టర్ బేలా షా జైన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తూ కుటుంబ సభ్యులకు అభినందనలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ‘ఫ్రంట్ కెమెరా’పై ప్రముఖ నటుడు ఎగతాళి!


