దిస్పూర్: అస్సాంలో భారీ వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 82కి చేరుకుందని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,92,799 మంది వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు.
వివిధ జిల్లాల్లో వరద తీవ్రత
అధికారుల వివరాల ప్రకారం.. అసోంలోని శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, చరైడియో జిల్లాలలో వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వాటిలో అత్యధికంగా చరైడియో జిల్లాలో 77,456 మంది, తర్వాతి స్థానాల్లో శివసాగర్‌లో 63,492 మంది, జోర్హాట్‌లో 34,067 మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితమయ్యారు.
వరదల ప్రభావితమైన వారి కోసం 54 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని అందులో దాదాపు 13,000 మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నారు. మరో 26 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు పనిచేస్తుండగా, వాటి ద్వారా 5,384 మందికి సాయం అందుతోందన్నారు. బాధితుల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.
వరద బాధితులకు ప్రభుత్వ ఊరట
వరద పీడిత ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్య ఘర్ పెండింగ్ రాష్ట్ర సబ్సిడీ కింద 9,289 మంది లబ్ధిదారులకు రూ. 41.67 కోట్లను ప్రభుత్వం ఆమోదించింది. అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDCL) ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా మంగళవారం (ఆగస్టు 4, 2026) నాటికి పూర్తి చేయాలని పవర్ డిపార్ట్‌మెంట్‌ను సీఎం ఆదేశించారు.
అంతకు ముందు ప్రధాని మాట్లాడుతూ వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ నాలుగు జిల్లాల్లోని వరద బాధితులందరికీ రుణాలు చెల్లించడంలో ఆరు నెలల మారటోరియం వర్తింపజేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు.


