కుల్గామ్: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో కార్మికుడు కూడా శనివారం మృతి చెందాడు. దీంతో ఈ దాడిలో మృతి చెందిన వారి సంఖ్య రెండుకి చేరింది. శుక్రవారం సాయంత్రం కుల్గామ్ జిల్లాలోని కేలామ్ ప్రాంతంలో ఉన్న ఒక ఇటుక బట్టీ వద్ద పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో దీపక్ రాత్రై అనే కార్మికుడు ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడిని ఎస్కేఐఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు కూడా శనివారం తుదిశ్వాస విడిచాడు. మృతులు ఇద్దరూ ఇరవై ఏళ్ల వయసువారేనని పోలీసులు వెల్లడించారు. ఈ ఉగ్రదాడిపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. ఈ ఘటనపై డీజీపీ నలిన్ ప్రభాత్చ ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరివేయాలని భద్రతా బలగాలను ఆదేశించినట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
ఈ దుశ్చర్యకు పాల్పడిన దోషులను చట్టం ముందు నిలబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడి బాధ్యతలను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) సంస్థ వహించింది. ఇది పది రోజుల వ్యవధిలో లోయలో జరిగిన రెండో పెద్ద ఉగ్రదాడి ఇదే కావడం గమనార్హం. జూలై 22న అనంతనాగ్ జిల్లాలోని లాల్‌చౌక్ ప్రాంతంలో జమ్ముకశ్మీర్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ ఖురేషీని ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ప్రాంతంలో ఉగ్రకార్యకలాపాలు గణనీయంగా తగ్గినప్పటికీ, మళ్లీ ఇలాంటి హత్యలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇది కూడా చదవండి: ప్రపంచానికి మరో పెనుముప్పు: సజీవ నోస్ట్రాడామస్ హెచ్చరిక!


