పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. స్థానిక సమస్యలు, రాజకీయ హక్కులు, పాలనా విధానాలపై అసంతృప్తితో జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రావల్‌కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు చేపట్టిన భారీ మార్చ్‌ను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఈ సందర్భంగా ఆందోళనకారుల కదలికలను నియంత్రించేందుకు సుమారు నాలుగు వేల మంది పాకిస్తాన్ రేంజర్స్‌ను మోహరించినట్లు సమాచారం. ప్రధాన రహదారులపై భద్రతను పెంచడం, కొన్ని ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించడం, నిరసనలను అడ్డుకునేందుకు పోలీసు బలగాలను రంగంలోకి దించడం వంటి చర్యలు చేపట్టారు. అలాగే, మీడియాపై కూడా నిషేధం విధించారు. దీంతో, అక్కడే ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది.
అయితే, ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న JAAC గత కొంతకాలంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజా సమస్యలను ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యం, పరిపాలనలో స్థానికులకు ఎక్కువ పాత్ర, ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు వంటి అంశాలపై కమిటీ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో పాకిస్తాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 స్థానాలు. ఈ స్థానాలు స్థానిక ప్రజల రాజకీయ హక్కులను ప్రభావితం చేస్తున్నాయని JAAC ఆరోపిస్తోంది. ఈ రిజర్వు స్థానాల వ్యవస్థలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తోంది.
అయితే ఆందోళనలు శాంతియుతంగా కొనసాగకముందే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడులు, నిరసనలు, బలగాల ప్రతిస్పందనతో పరిస్థితి అదుపు తప్పినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో ప్రాణనష్టం కూడా జరిగినట్లు సమాచారం. పాక్ ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే భద్రతను పెంచినట్లు చెబుతోంది. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆందోళనకారులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.
ముజఫరాబాద్ వైపు సాగుతున్న ఈ మార్చ్ ఇప్పుడు కేవలం స్థానిక నిరసనగా కాకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి సంకేతంగా మారింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం దీనిని ఎలా ఎదుర్కొంటుంది? నిరసనకారులతో చర్చలకు దిగుతుందా? లేక కఠిన చర్యలకే పరిమితం అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజా డిమాండ్లు, ప్రభుత్వ నియంత్రణ చర్యలు, భద్రతా బలగాల మోహరింపు మధ్య ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత సున్నితంగా మారాయి.


