ఢాకా: దేశం కాని దేశంలో, విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారత్ ప్రతిష్ఠను నిలబెట్టిన భారతీయ దౌత్యవేత్త పూజా కుమారి ఝా ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. దక్షిణాసియా మ్యాప్‌లో జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడాన్ని ఆమె వెంటనే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సరిదిద్దాలని కోరారు. ఆమె సమయస్ఫూర్తి, ధైర్యం సభలో ఉన్నవారి దృష్టిని ఆకర్షించింది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ‘సార్క్ పునరుద్ధరణ - ప్రాంతీయ సమగ్రత’ అనే అంశంపై ఉన్నత స్థాయి విదేశాంగ విధాన సెమినార్ నిర్వహించారు. ఢాకాలోని బంగ్లాదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ (BIISS) ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, నిపుణులు పాల్గొన్నారు.
సదస్సులో బంగ్లాదేశ్ మాజీ దౌత్యవేత్త అహ్మద్ తారిఖ్ కరీం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా, స్క్రీన్‌పై ప్రదర్శించిన దక్షిణాసియా మ్యాప్‌లో జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించారు. దీనిని గమనించిన భారత హైకమిషన్ సెకండ్ సెక్రటరీ పూజా కుమారి ఝా వెంటనే జోక్యం చేసుకుని, ఆ మ్యాప్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
దీనికి స్పందించిన తారిఖ్ కరీం.. మీరు భారత్ నుంచి వచ్చారా? అని ప్రశ్నించగా.. నేను పూజా కుమారి ఝా భారత హైకమిషన్‌లో సెకండ్ సెక్రటరీ అని ఆమె తనను పరిచయం చేసుకున్నారు. అనంతరం తారిఖ్ కరీం.. మీ అభ్యంతరాన్ని నమోదు చేసుకున్నాను’ అని పేర్కొంటూ తన ప్రజెంటేషన్‌ను కొనసాగించారు.
ఎవరీ పూజా కుమారి ఝా?
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. పూజా కుమారి ఝా 2022 బ్యాచ్‌కు చెందిన భారత విదేశాంగ సేవ అధికారిణి. ప్రస్తుతం ఢాకాలోని భారత హైకమిషన్‌లో రాజకీయ, సమాచార విభాగంలో సెకండ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె 2021 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 82వ ర్యాంకు సాధించారు. కేవలం 25 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించడం విశేషం.
పూజా బీహార్ రాష్ట్రంలోని సీతామఢీ జిల్లా పురన్హియా గ్రామానికి చెందినవారు. అనంతరం ఆమె కుటుంబం ఢిల్లీకి వలస వెళ్లింది. ఆమె తండ్రి గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆఫీస్ హెల్పర్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. పూజా కుటుంబంలో ఐదో కుమార్తె.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ పాఠశాల నుంచి మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆమె విద్యను కొనసాగించారు. ఆమె పెరిగిన సమాజంలో ఆడపిల్లల కంటే మగపిల్లలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. అలాంటి పరిస్థితులను మార్చడానికి చదువే మార్గమని పూజా, ఆమె సోదరీమణులు నమ్మారు.
ఒకప్పుడు ఆమె తండ్రి, నువ్వు ఐఏఎస్ అధికారిణి అవుతావు గానీ, బాలీవుడ్ నటి కాలేవు. పెద్ద కలలు కనకు అని చెప్పేవారని పూజా ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. అయితే తన కృషి, పట్టుదలతో ఆమె ఆ మాటలను తప్పు అని నిరూపించారు.
నేడు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, దేశ ప్రయోజనాలను ధైర్యంగా వినిపిస్తున్న పూజా కుమారి ఝా అనేక మంది యువతులకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
India’s Second Secretary at the Indian High Commission in Dhaka, Puja Jha, raised an immediate objection after a map shown during a foreign policy seminar in Bangladesh depicted Jammu & Kashmir as part of Pakistan.
She stated that Jammu & Kashmir is an integral and inalienable… pic.twitter.com/a4b2IV8ZhA— Aditya Raj Kaul (@AdityaRajKaul) July 10, 2026


