పూణే: మహారాష్ట్రలోని పూణేలో రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా బాధితుడి తల్లి రాఖీ అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ భావోద్వేగ లేఖ రాశారు. తన కుమారుడి హత్యకు కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూసి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె ప్రధానిని వేడుకున్నారు.
గత జూన్ 18న కేతన్‌తో వివాహం జరగాల్సిన సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలసి కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించి, వారిని అరెస్ట్ చేశారు. కేతన్ మృతిచెందిన 20 రోజులకే, ఆ బాధను తట్టుకోలేక అతని తాత కన్నుమూశారు. దీనిపై రాఖీ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేస్తూ, కొద్దిరోజుల వ్యవధిలోనే తమ కుటుంబం రెండు తరాలను కోల్పోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రతిరోజూ తమ ఇల్లు కేతన్ జ్ఞాపకాలతో ప్రతిధ్వనిస్తోందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
తాము ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు ఆశించడం లేదని, కేవలం సత్వర న్యాయం మాత్రమే కావాలని ఆమె ఆ లేఖలో కోరారు. కాగా ఇప్పటికే కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కూడా ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. దోషులకు చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేలా ప్రధాని వ్యక్తిగతంగా చొరవ చూపాలని బాధితుని తల్లి విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: ‘భోజశాల’పై సుప్రీం తీర్పు.. నమాజ్‌కు నిరాకరణ


