లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్(22) సుమారు 40 నిమిషాల పాటు ప్రాణాల కోసం సహాయం కోరినా, సకాలంలో వైద్య సహాయం అందక మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. జూలై 12న ఆటో చార్జీ విషయంలో డ్రైవర్‌తో రాజ్‌కుమార్‌కు వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమీపంలోని పోలీసుల పింక్ బూత్ వద్దకు వెళ్లి సహాయం కోరాడు. అయితే బూత్ మూసి ఉండటంతో లోపల ఉన్న సిబ్బంది దృష్టికి తీసుకెళ్లేందుకు గాజు తలుపును బలంగా కొట్టాడు. దీంతో గాజు పగిలి అతని చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న రాజ్‌కుమార్ దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే పడి సహాయం కోసం వేడుకున్నా ఎవరూ వెంటనే ఆస్పత్రికి తరలించలేదని తెలిపారు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
गाजियाबाद पुलिस पर सवाल!
मदद मांगने पहुंचे व्यक्ति को कथित तौर पर पिंक बूथ का दरवाजा नहीं खोला गया, शीशा तोड़ने पर हाथ की नसें कट गईं, देर तक सड़क पर तड़पता रहा।
— जनता की सुरक्षा के लिए बने बूथ आखिर किस काम के?#Ghaziabad #UPPolice #ViralVideo pic.twitter.com/UvZT9C1l84— Payall Singhh (@PayallSingh13) July 14, 2026
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘాజియాబాద్ పోలీసులు మాత్రం రాజ్‌కుమార్, ఆటో డ్రైవర్ ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని, గాయపడిన వెంటనే ఆస్పత్రికి తరలించామని చెబుతున్నారు. దీంతో, ఈ ఘటనపై ఘాజియాబాద్ డీసీపీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల స్పందన, వైద్య సహాయం అందించడంలో జరిగిన ఆలస్యం, వైరల్ వీడియోలతో పాటు ఘటన మొత్తం మీద సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.


