'బాసింగ బలాలే'.. తెలంగాణ జానపదానికి కొత్త ఊపు.. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న ఫోక్ సాంగ్..
ఒక మంచి జానపద పాటకు కాలంతో సంబంధం ఉండదు. మట్టివాసన, పల్లె పలుకులు, సంప్రదాయాల సోయగం కలిస్తే ఆ పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రస్తుతం అలాంటి ఆదరణనే సొంతం చేసుకుంది 'బాసింగ బలాలే' ఫోక్ సాంగ్. తెలంగాణ పల్లె సంస్కృతిని, పెళ్లి వేడుకల సందడిని, గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే ఈ పాట సోషల్ మీడియా వేదికలపై విపరీతమైన ఆదరణ పొందుతోంది.
"బాసింగం" అనేది తెలుగు సంప్రదాయ వివాహాల్లో వధూవరులు నుదుటిపై ధరించే పవిత్రమైన అలంకారం. పెళ్లి వేడుకలో దానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అదే సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన "బాసింగ బలాలే" పాటలో తెలంగాణ యాస, జానపద సంగీతం, డప్పు బీట్‌లు, ఉత్సాహభరితమైన సాహిత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పాట విడుదలైన నాటి నుంచి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో లక్షలాది వీడియోలు రూపొందుతున్నాయి. పెళ్లిళ్లు, హల్దీ వేడుకలు, కాలేజీ ఈవెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా ఎక్కడ చూసినా 'బాసింగ బలాలే' పాటే మార్మోగుతోంది. చిన్నారుల నుంచి యువత వరకు ఈ పాటకు ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.


