గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు | Singer S Janaki cremated with full state honours in Mysuru | Sakshi
Sakshi News home page

గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు

Jul 13 2026 4:57 AM | Updated on Jul 13 2026 4:57 AM

Singer S Janaki cremated with full state honours in Mysuru

ఎస్‌.జానకి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న మనవరాలు అప్సర

ఎస్‌.జానకికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు  

అన్నీ తానై నిర్వహించిన మనవరాలు అప్సర  

తరలి వచ్చిన సినీ తారలు, అభిమానులు 

ఆమెతో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం

మైసూరు: తన గానామృతంతో కోట్లాది మందిని ముగ్ధుల్ని చేసిన ఆ మధుర కంఠం చితి మంటల్లో పంచభూతాల్లో కలిసిపోయింది. తన సుమధుర కంఠంతో కోట్లాది గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన గాన కోకిల ఎస్‌.జానకి పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం మైసూరులోని కనియనహుండి ఫామ్‌హౌస్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, బంధు మిత్రుల కన్నీటి సంద్రం మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. 88 ఏళ్ల వయసులో శనివారం సాయంత్రం ఆమె వయో సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.

జానకి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8:53 గంటలకు జిల్లా అధికారులు అంబులెన్సులో మహారాజా కళాశాల మైదానానికి తీసుకువచ్చారు. ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మైసూరుకు తరలివచ్చారు. రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు, సినీ నటీమణులు, నిర్మాతలు, కళాకారులు కన్నీటితో నివాళులర్పించారు.

ప్రముఖ గాయని చిత్ర, సీనియర్‌ నటి జయమాల, తార, నిర్మాత కె.మంజు, నటుడు వినోద్‌ రాజ్, గాయకుడు రాజేష్‌ కృష్ణన్, ప్రముఖ సంగీత దర్శకుడు సాధు కోకిల తదితర శాండల్‌వుడ్‌ నటీనటులు ఈ సందర్భంగా సంగీత ప్రపంచానికి ఎస్‌.జానకి చేసిన సేవల గురించి కొనియాడారు. వేలాది మంది ప్రజలు క్యూలో నిలబడి ఆమెను కడసారి చూసుకున్నారు. అక్కడికి తరలి వచి్చన వారందరికీ కనిపించేలా ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రత్యక్ష ప్రసారం చేశారు. కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తరలివచ్చారు.

కొందరైతే తమ కుటుంబాలతో సహా వచ్చి కన్నీటితో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాల గాయకుల బృందం ఎస్‌.జానకి సూపర్‌ హిట్‌ గీతాల ఆలాపన నిర్వహించడం అందరి గుండెల్లో ఆర్ర్ధత నింపింది. అనంతరం కర్ణాటక సీఎం డీకే శివకుమార్, మైసూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం డి.కె.శివకుమార్‌ మాట్లాడుతూ.. ఎస్‌.జానకి భారతదేశం గర్వించదగ్గ సంగీత దిగ్గజాల్లో ఒకరని కొనియాడారు. ఆమె వారసత్వాన్ని చిరస్థాయిగా నిలిపేందుకు చిత్ర పరిశ్రమతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

చితికి నిప్పంటించిన మనవరాలు అప్సర 
ఎస్‌.జానకి అంత్యక్రియల నిర్వహణకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3:05 గంటలకు ఎస్‌.జానకి పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో రాజ లాంఛనాలతో ఊరేగింపుగా మైసూరు సమీపంలోని హెచ్‌డి కోటె తాలూకా కణియర హుండిలోని ఫాంహౌస్‌లో అంత్యక్రియల స్థలికి తీసుకొచ్చారు. పోలీసులు జాతీయ గీతాలాపన మధ్య గన్‌ సెల్యూట్‌ ఇచ్చి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మనవరాలు వైద్యుల అప్సర తన నాన్నమ్మను దగ్గరగా చూస్తూ కొన్ని క్షణాలు గడిపారు.

అది చూసి అందరి కళ్లు చెమర్చాయి. అనంతరం వేద మంత్రాల మధ్య ఆమె తన నాన్నమ్మ చితికి నిప్పంటించి కుటుంబ సంప్రదాయం మేరకు అంత్యక్రియలు నిర్వహించారు. మట్టి కుండను భుజంపై మోస్తూ చితి చుట్టూ ప్రదక్షిణ చేశారు. వేద పండితులు రమేష్‌ శర్మ బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తయింది. అప్సర.. జానకి కుమారుడు మురళీకృష్ణ కుమార్తె. మురళీకృష్ణ ఈ ఏడాది జనవరి 22న మరణించారు. 1938 ఏప్రిల్‌ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పల్లపట్లలో జన్మించిన ఎస్‌.జానకి.. చివరి ఆరేళ్లు మైసూరును తన నివాసంగా ఎంచుకున్నారు. ఆమె కోరిక మేరకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement