మూగబోయిన స్వర కోయిల | Legendary playback singer S Janaki passes away at 88 | Sakshi
Sakshi News home page

మూగబోయిన స్వర కోయిల

Jul 12 2026 4:21 AM | Updated on Jul 12 2026 7:23 AM

Legendary playback singer S Janaki passes away at 88

కోట్లాది హృదయాలు గెలుచుకున్న విఖ్యాత గాయని ఎస్‌.జానకి కన్నుమూత

వృద్దాప్య సమస్యలతో బాధ పడుతూ మైసూరు ఆస్పత్రిలో చికిత్స 

మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో గుండెపోటుతో తనువు చాలింపు 

ప్రజల సందర్శనార్థం నేటి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహారాజ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో పార్థివదేహం 

ప్రభుత్వ లాంఛనాలతో మైసూరు బోగాదిలో నేటి సాయంత్రం అంత్యక్రియలు

మైసూరు/బెంగళూరు/తెనాలి: తేనెలూరు తెలుగువారి గళ మాధుర్యాన్ని అనేక భాషల్లో శ్రోతలకు రుచి చూపించి మన కీర్తి పతాకను దశ దిశలా ఎగురవేసిన స్వర కోయిల మూగవోయిందన్న వార్త సంగీత ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన పాటలతో జగమే ఊయల చేసిన మధుర గాయని ఎస్‌.జానకి ఇక లేరన్న చేదు వార్త విని సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. తన సుమధుర కంఠంతో ఆబాలగోపాలాన్ని ఓలలాడించిన బహుభాషా గాయని ఎస్‌.జానకి (88) శనివారం రాత్రి మైసూరు నగరంలో గుండెపోటుతో కన్నుమూశారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె పాత తాలూకాలోని నిజాంపట్నం మండలం పల్లపట్ల వాస్తవ్యురాలైన ఆమె ఆరేళ్లుగా మైసూరు బన్నూరు రోడ్డులోని ఫార్మ్‌హౌజ్‌లో నివాసం ఉంటున్నారు. ఎల్లప్పుడూ ధవళ వర్ణ సంప్రదాయ చీరకట్టులో కనిపించేవారు. కొన్నేళ్లుగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవలే బోగాది నగరలోని ఎస్‌బీఎం లేఔట్‌ నివాసంలో అద్దెకు ఉంటున్నారు. నవీన్, పవన్‌ అనే వ్యక్తులు ఆమెకు తోడునీడగా ఉంటూ సేవలు చేస్తూ వచ్చారు. వారం క్రితమే ఆమె మంగళూరుకు తన అక్క ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. 

ఈ సమయంలో ఆమెతో పాటు కోడలు ఉమా, మనమరాలు అప్సరా కూడా ఉన్నారు. గత సంవత్సరం ఆమె తన కుమారుడు మురళీకృష్ణను కోల్పోవడంతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని మౌనంగా ఉండిపోయారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మధ్యాహ్నం 12.49 గంటలకు మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినా ఆమె మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూల్‌ (బహుళ అవయవ వైఫల్యం)తో గుండెపోటుకు గురయ్యారు. 

రాత్రి 7.30 గంటలకు ఆమె మరణించారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకుని ఆమె బంధువులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండి గ్రామంలోని ఫామ్‌హౌజ్‌లో జరుగుతాయని బంధువులు మీడియాకు తెలిపారు. అంతంకు ముందు ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఉంచుతారు. ప్రభుత్వ లాంఛనాలతో జానకి అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  

ఆటుపోట్ల జీవితం 
ఎస్‌.జానకి తన తీయని కంఠం ద్వారా ప్రజలను ఎంతగా ముగ్ధుల్ని చేశారో ఆమె జీవితం అంతగా ఆటుపోట్లకు గురైంది. 1938 ఏప్రిల్‌ 23న సత్యవతి, శ్రీరామమూర్తి దంపతులకు జన్మించారు. తండ్రి ఆయుర్వేద వైద్యుడు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో నాలుగో సంతానం జానకి. చదువంటే శ్రద్ధ లేదు. బడి అంటే ఆమడదూరం వెళ్లేవారు. రేడియోలో పాటలు వింటూ కాలక్షేపం. రోడ్డుపైకి వెళ్లినపుడు లతా మంగేష్కర్‌ పాటలు వింటూ, తాను పాడుతూ పెరిగారు. వివిధ కారణాలరీత్యా శ్రీరామమూర్తి కుటుంబం కొంతకాలం కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో, తర్వాత రాజమండ్రిలో ఉన్నారు. 

సిరిసిల్లలోనే తన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తన చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఎండ్ల బండిలో వేములవాడకు వెళ్లి బాలనాగమ్మ సినిమాను చూసి వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో జానకి గుర్తుచేసుకున్నారు. పాటలపై కూతురుకు గల ఆసక్తిని గమనించిన తల్లి సత్యవతి, రాజమండ్రిలో నాదస్వర విద్వాన్‌ గాడవల్లి పైడిస్వామి దగ్గర సంగీతంలో ప్రాథమిక శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా శాస్త్రీయ సంగీతం ఎవరి వద్దా నేర్చుకోలేదు. గురువు గారు కీర్తనలతో ఆరంభించినా, జానకి ధ్యాసంతా సినిమా పాటలపైనే ఉండేది. అక్కడుండే ‘క్రాంతి కళామండలి యూత్‌ అసోసియేషన్‌’లో సినిమా పాటల కచేరీల్లో పాటలు పాడుతున్న కాలంలో, అమ్మ మరణంతో మళ్లీ ఆ కుటుంబం హైదరాబాద్‌కు చేరుకుంది.

జానకి మామయ్య ‘ఫన్‌ డాక్టర్‌’చంద్రశేఖర్‌ వేదికపై ప్రదర్శనలిస్తుండేవారు. మధ్యమధ్యలో జానకి పాటలు పాడుతూ వచ్చారు. ఆయన కుమారుడు వి.రాంప్రసాద్, జానకి స్వరంలోని ప్రత్యేకతను గమనించారు. కుమారుడు చేసిన సూచనతో చంద్రశేఖర్, చెన్నైలోని రెండు మూడు స్టూడియోలకు జానకి గురించి లేఖ రాశారు. ఏవీఎం స్టూడియో నుంచి ఆడిషన్‌కు రమ్మని కబురొచి్చంది. స్టూడియో స్టాఫ్‌గా ఎంపిక చేసుకున్నారు. తాను ఇష్టపడిన రాంప్రసాద్‌తోనే ఆమెకు 1959లో వివాహమైంది. పాటలకు సంబంధించిన ఒప్పందాలు, రెమ్యూనరేషన్, రాయల్టీలు అన్ని విషయాలు ఆయనే చూసుకున్నారు.

1997లో గుండెపోటుతో భర్త మృతి చెందారు. చెన్నైలో స్థిరపడిన జానకి దంపతులకు ఏకైక కుమారుడు మురళీకృష్ణ కొన్ని సినిమాల్లో నటించినా ఎక్కువకాలం కొనసాగలేదు. కోడలు ఉమ నర్తకి. దూరదర్శన్‌ ఏ గ్రేడ్‌ ఆర్టిస్ట్‌. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’అవార్డు కూడా తీసుకున్నారు. ‘పాట నాకు ప్రాణం.. ప్రాణమున్నంతకాలం పాడుతూనే ఉంటాను’అంటుండే జానకి, భౌతికంగా ఊపిరి కోల్పోయినా ఆమె పాట ఇప్పటికీ, ఎప్పటికీ అభిమాన శ్రోతలను అలరిస్తూనే ఉంటుంది. కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తుమ్మలూరు గ్రామంలోని మ్యాక్‌ ప్రాజెక్టులో 279 నంబర్‌ విల్లాను కొనుగోలు చేసి కుమారుడు మురళీకృష్ణతో ఆమె నివసించారు. 

ఒక ఊపు ఊపిన ‘నీ లీల పాడెద దేవా..’ 
⇒  1957లో సంగీత దర్శకుడు టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో ‘విధియిన్‌ విళైయట్టు’తమిళ సినిమాలో రెండు పాటలు పాడించారు. ఆ సినిమా విడుదల కాలేదు. ఆ వెంటనే తెలుగులో ‘ఎంఎల్‌ఏ’సినిమా కోసం ‘నీ ఆశ అడియాశ చెయి జారే మణిపూస’పాటను ఘంటసాలతో కలిసి పాడారు. తొలిగా విషాదగీతంతో ఆరంభించినా, ఆమె సినీ కెరీర్‌ మధుర వెన్నెలలా కొనసాగింది. బావా మరదళ్లు సినిమాలో ‘నీలి మేఘాలలో గాలి కెరటాలలో’పాటతో బిజీ అయ్యారు.  

⇒  ఆ క్రమంలోనే ‘మురిపించే మువ్వలు’సినిమాలో జానకి పాడిన ‘నీ లీల పాడెద దేవా’పాట దక్షిణాదిని ఒక ఊపు ఊపింది. తద్వారా సినీ రంగంలో ఆమెకో ప్రత్యేక స్థానం లభించింది. వాస్తవానికి ఆ పాటను పి.లీలతో పాడించాలని నిర్ణయించారు. అంత హైపిచ్‌తో తాను పాడలేనని, జానకిచే పాడించమని పి.లీల సూచించారు. ఆ పాటకు అభినయించే సావిత్రి మాత్రం సుశీలతో పాడించాలని పట్టుబట్టారు. ఆ చిత్ర సంగీత దర్శకుడు సుబ్బయ్యనాయుడు జానకి చేతనే పాడించారు. 

⇒   ఇక జానకి వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. దిగ్గజ సంగీత దర్శకుల సంగీతానికి పాటలు పాడుతూ బిజీ అయ్యారు. మరో సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు జానకి పాటను అనుకోకుండా విన్నారు. వెంటనే పూజాఫలం సినిమాలో ‘పగలే వెన్నెలా.. జగమే ఊయల’పాడించటంతో మరింత బిజీ గాయనిగా మారారు. 

⇒   ఆరాధనలో ‘ఆడదాని ఓరచూపులో’, రంగులరాట్నంలో ‘నడిరేయి ఏ జాములో’వంటి సూపర్‌ హిట్‌ పాటలతో జానకి సినిమా పాటల ప్రయాణం ప్రవాహంలా సాగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, పంజాబి, ఒరియా, తుళు, కొంకణి, బడగ, సింహళం, ఇంగ్లి‹Ù, సంస్కృతం, జర్మన్, జపాన్‌ వంటి 20 భాషల్లో 48 వేలకు పైగా పాటలతో అలుపెరగని కోయిల అనిపించుకున్నారు. వీటిలో 17 వేలకు పైగా సినిమా పాటలు కాగా, మిగిలినవి ప్రైవేటు రికార్డులు, త్యాగరాజ కృతులు, మీరా భజన్లు. సొంత సంగీతంలో పాడారు. వీటితో పలు భక్తి సంగీత క్యాసెట్లు వచ్చాయి.

ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు 
⇒   చిన్న పిల్లలకు పాడాలన్నా జానకమ్మనే పిలిచే వారు సంగీత దర్శకులు. ‘చందమామ రావే’(1987), ‘జడ్జిమెంట్‌’(1990) సినిమాల్లో బేబి సుజితకు డబ్బింగ్‌ చెప్పారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ వారి ‘మౌన పోరాటం’సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. తన గాన మాధుర్యానికి వరించిన గౌరవాలెన్నో. ఆకాశవాణి పాటల పోటీల్లో ద్వితీయస్థానం సాధించి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. నాలుగుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డును స్వీకరించారు. 

⇒  13 సార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఆరుసార్లు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, మరో ఆరుసార్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అవార్డులు, 12 నంది అవార్డులు (ఇందులో రెండు టెలివిజన్‌), ఒడిశా ప్రభు త్వ అవార్డులు లభించాయి. కలైమామణి, సుర్‌సింగార్, సింగర్‌ ఆఫ్‌ ది సెంచరీ, భారతీదాసన్‌ వంటి అవార్డులు మరికొన్ని. సంగీత ప్రపంచంలో రారా ణిగా వెలుగొందిన జానకి తమిళనాడు కోటాలో కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్‌’పురస్కారాన్ని ప్రకటించింది. అప్పుడా గౌరవాన్ని జానకి తిరస్కరించటం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. అయిదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో చేసిన కృషికి ప్రభుత్వం ఆలస్యంగా స్పందించినా, దేశ ప్రజలందరి హృదయాల్లో తనకున్న స్థానమే చాలని ఆమె సంతృప్తి చెందారు. గాయనిగా ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎప్పుడో ఇస్తే ఎలాగని తిరస్కరించారని అంతా భావించారు.  

⇒  ఎస్‌.జానకికి దైవ భక్తి ఎక్కువ. నంజనగూడులోని నంజుండేశ్వర, చాముండేశ్వరి, యోగా నరసింహస్వామి దేవాలయాల్లో తరచూ పూజలు చేసేవారు. అద్భుత సంగీత పయనం అనంతరం 2017 అక్టోబర్‌ 28న మైసూరు విశ్వవిద్యాలయం మానస గంగోత్రిలోని రంగమందిరంలో ఆమె తన పాటకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఇకపై తాను ప్రజా వేదికల్లో పాడబోనని ప్రకటిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.  

సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు
వైఎస్‌ జగన్‌ సంతాపం 
సాక్షి, అమరావతి: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్‌.జానకి మరణం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్‌.జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు. తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్‌.జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్‌.జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించానన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

సంగీత ప్రపంచానికి తీరని లోటు: గవర్నర్‌ 
సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నేపథ్య గాయని ఎస్‌.జానకి మృతిపై గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా సంతాపం వ్యక్తంచేశారు. జానకి మృతి భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. తెలుగు నేల గర్వించదగ్గ మహోన్నత గాయని జానకి అని కొనియాడారు. జానకి గానామృతం తరతరాలపాటు సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

జానకి తెలుగు ప్రజలకు గర్వకారణం: సీఎం 
జానకి మృతి పట్ల సీఎం ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. జానకమ్మ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటని పేర్కొన్నారు. జానకి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.  

కిషన్‌రెడ్డి, సంజయ్, రాంచందర్‌రావు సంతాపం 
జానకి మృతి పట్ల కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన జానకి కన్నుమూశారనే వార్త విచారకరమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జానకి మరణం భారతీయ సంగీతానికి ఎంతో లోటని సంజయ్‌ తెలిపారు. ప్రపంచ సంగీతానికి జానకి మరణం తీరని లోటని రాంచందర్‌రావు పేర్కొన్నారు. 

జానకి మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు: కేసీఆర్‌ 
జానకి మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. జానకమ్మ మరణం దక్షిణ భారత సంగీత ప్రపంచానికి, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలపాటు వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

జానకి మరణవార్త ఎంతో బాధాకరం: కేటీఆర్‌ 
జానకి మరణం చలనచిత్ర రంగానికి తీరనిలోటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. జానకి తన బాల్యంలో కొన్నేళ్లు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నివాసం ఉన్నారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేటీఆర్‌ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement