జోరుగా హుషారుగా... | Tollywood Movies Shooting Update: Some Heroes who are busy shooting in Tollywood at Hyderabad | Sakshi
Sakshi News home page

జోరుగా హుషారుగా...

Jul 12 2026 12:22 AM | Updated on Jul 12 2026 12:26 AM

Tollywood Movies Shooting Update: Some Heroes who are busy shooting in Tollywood at Hyderabad

భాగ్యనగరంలో భలే సందడిగా...

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో.. ప్రత్యేకించి హైదరాబాద్‌లో తెలుగు చిత్రాల మూవీస్‌ షూటింగ్స్‌ సందడి జోరుగా హుషారుగా ఉంది. ప్రస్తుతం భాగ్యనగరంతో (హైదరాబాద్‌) పాటు పరిసర ప్రాంతాల్లో కొన్ని చిత్రాల షూటింగ్స్‌ జరుగుతున్నాయి. వెంకటేశ్, ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, గోపీచంద్, నాని, విజయ్‌ దేవరకొండ, కల్యాణ్‌ రామ్, శ్రీ విష్ణు వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్‌లో జోరుగా హుషారుగా పాల్గొంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఓ లుక్కేద్దాం...

శంషాబాద్‌లో...  
‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్‌ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (2022) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. దుర్గా ఆర్ట్స్, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్లపై కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేశ్‌బాబు రాముడిగా, రుద్రగా కనిపించనున్నారు. హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా మందాకినిగా, మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కుంభ అనే ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్‌ ట్రావెల్‌ టైమ్‌ మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ‘వారణాసి’ రూపొందుతోంది. ఇందులోని రామాయణం ఎపిసోడ్‌ సినిమాకి హైలైట్‌గా ఉంటుందట. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా సెట్‌ వేయించారు. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌బాబు లేకున్నప్పటికీ కీలక తారాగణంపై ఈ సెట్‌లో ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట రాజమౌళి.

ఈ సినిమా చిత్రీకరణకు కాస్త బ్రేక్‌ రావడంతో కుటుంబంతో కలిసి విదేశాలకు వెకేషన్‌ వెళ్లిన మహేశ్‌బాబు తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. ఈ నెల 16 నుంచి ఆయన ‘వారణాసి’ షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది. మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ‘వారణాసి’పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027 ఏప్రిల్‌ 7న ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.  

అటు మోకిలా... ఇటు శంకర్‌పల్లి 
హీరో వెంకటేష్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ఇటు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా, అటు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఓ మూవీ... ఇలా రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారాయన. వెంకటేష్‌–కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఓ మల్టీస్టారర్‌ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్‌–అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఐదో సినిమాగా, కల్యాణ్‌ రామ్‌–అనిల్‌ రావిపూడి కాంబోలో రెండో సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి  ‘వెంకీఅనిల్‌5, ఎన్‌కేఆర్‌ఏఆర్‌2’ అన్నది వర్కింగ్‌ టైటిల్‌.

ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన కీర్తి సురేష్, కల్యాణ్‌ రామ్‌ సరసన కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని మోకిలాలో జరుగుతోంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన భారీ సెట్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో వెంకటేష్, కల్యాణ్‌ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనిల్‌ రావిపూడి శైలిలో వినోదాత్మకంగా ఈ మూవీ రూపొందుతోంది. ‘‘వెంకటేష్‌–కల్యాణ్‌ రామ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీరిద్దరి ఆన్‌ స్క్రీన్‌ అనుబంధం ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేస్తుంది.

ఈ సినిమా నుంచి కల్యాణ్‌ రామ్‌ పుట్టినరోజు (జూలై 5న) సందర్భంగా విడుదల చేసిన ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. క్రేజీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.  

వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్‌ నెం: 47 (ఏకే 47)’ అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘కేజీఎఫ్, ‘హిట్‌ 3, తెలుసు కదా’ చిత్రాల ఫేమ్‌ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 2న విడుదల కానుంది.

అల్యూమినియం ఫ్యాక్టరీలో...  
హీరో గోపీచంద్‌ కూడా స్పీడ్‌ పెంచారు. ఓ వైపు   ‘సింగ’, మరోవైపు ‘భరతవర్ష’ మూవీస్‌తో బిజీగా ఉన్నారాయన. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ‘సింగ’ ఒకటి. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ వి. వెంకట్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్‌ హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్‌టైన్  మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.

గోపీచంద్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు వెంకట్‌. జూన్‌ 12న గోపీచంద్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సింగ’ టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను యూనిట్‌ రివీల్‌ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘సింగ’. ఫైట్‌ మాస్టర్‌గా సక్సెస్‌ అందుకున్న వెంకట్‌.. గోపీచంద్‌ని ఎంత పవర్‌ఫుల్‌ మాస్‌ లుక్‌లో చూపించనున్నారో గ్లింప్స్‌తోనే చూపించాం.

యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్‌ఫుల్‌ కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో గోపీచంద్‌ను కొత్త కోణంలో చూపించనున్నారాయన. యాక్షన్‌ డైరెక్టర్‌ నుంచి దర్శకుడిగా వెంకట్‌ చేస్తున్న ఈ ప్రయాణంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే... గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘భరతవర్ష’. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.  
 
అజీజ్‌ నగర్‌లో...  
హీరో ప్రభాస్‌ యమా జోరు మీద ఉన్నారు. వరుస పాన్‌ ఇండియన్‌ మూవీస్‌తో దూసుకెళుతున్నారాయన. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్, ఫౌజీ, కల్కి 2’ వంటి సినిమాలు చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. ‘అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్, యానిమల్‌’ చిత్రాల ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్‌’. ‘యానిమల్‌’ మూవీ ఫేమ్‌ త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భద్రకాళి పిక్చర్స్, టి. సిరీస్‌ బ్యానర్స్‌పై భూషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా, క్రిషణ్‌ కుమార్, ప్రభాకర్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని అజీజ్‌ నగర్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు కీలక తారాగణం పాల్గొంటుండగా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట సందీప్‌ రెడ్డి.  ‘‘భారీ స్థాయిలో, అద్భుతమైన ఎమోషన్స్తో రూపొందుతోన్న ‘స్పిరిట్‌’ చిత్రం ప్రేక్షకులకు ఓ ఇంటెన్స్ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్ని అందించేలా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకుట్టుకునేలా ఈ మూవీని రూపొందిస్తున్నాం. 2027 మార్చి 5న 8 భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.  

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రం ‘ఫౌజీ’. ‘సీతారామం’ మూవీ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్‌ ఖేర్, మిథున్‌ చక్రవర్తి, భాను చందర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్‌ గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్   ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్   డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్‌ ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగ సందర్భంగా అక్టోబరులో ‘ఫౌజీ’ సినిమా విడుదల కానుంది.  

ఆర్‌ఎఫ్‌సీలో...  
‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఎన్టీఆర్‌ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్‌’. ‘కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్‌ 2, సలార్‌’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిల్‌ కపూర్, బిజూ మీనన్  , ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్‌ కనకాల, అశుతోష్‌ రాణా, అన్షుమన్‌ పుష్కర్, సిద్ధాంత్‌ గు΄్తా, ప్రభాస్‌ శ్రీను, శత్రు, శివ, భీమల్‌ జీత్‌ ఒబెరాయ్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్  ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌ సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఎన్టీఆర్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్‌ నీల్‌. ఇప్పటివరకు చూడనటువంటి మాస్‌ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారట దర్శకుడు.

ఈ మూవీలో ఓ లుక్‌లో సన్నగా కనిపించే ఆయన మరో లుక్‌లో కొంచెం బొద్దుగా కనిపిస్తారని తెలిసింది. మాస్‌ హీరో, మాస్‌ డైరెక్టర్‌ ఇమేజ్‌ ఉన్న ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘డ్రాగన్‌’ మూవీపై ఇటు ట్రేడ్‌ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్‌ బజ్‌ నెలకొంది.    ‘‘డ్రాగన్‌’ కథ గోల్డెన్‌ ట్రైయాంగిల్‌ ప్రాంతంలోని అంతర్జాతీయ అక్రమ వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్‌ ఇందులో లూగర్‌ అనే పాత్రలో అఫ్ఘాన్‌ ట్రేడింగ్‌ కంపెనీకి చెందిన అస్సాసిన్‌–ఇన్‌–చీఫ్‌ అనే పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2027 జూన్‌ 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే.  
 
గండిపేటలో...  
విజయ్‌ దేవరకొండ హీరోగా ‘రణబాలి, రౌడీ జనార్థన’ వంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. ‘రణబాలి’ చిత్రానికి రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్‌ మూవీ తర్వాత విజయ్‌ దేవరకొండ–రాహుల్‌ సాంకృత్యాన్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. హాలీవుడ్‌ మూవీ ‘ది మమ్మీ’  ఫేమ్‌ ఆర్నాల్డ్‌ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.

విజయ్‌ దేవరకొండతో పాటు ఈ మూవీలోని ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారట రాహుల్‌. ‘‘19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది. విజయ్‌ దేవరకొండ బర్త్‌ డే (మే 9) సందర్భంగా రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌లోని యాక్షన్‌ సీక్వెన్సులు మూవీ లవర్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి.

భారీ అంచనాలున్న మా సినిమాని సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘రౌడీ జనార్థన’. రవికిరణ్‌ కోలా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్  గా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. రూరల్‌ యాక్షన్   డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. డిసెంబరులో ‘రౌడీ జనార్థన’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.  

శంకర్‌పల్లిలో...  
శ్రీ విష్ణు హీరోగా రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. వాటిలో ఒకటి ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ కాగా మరో చిత్రానికి డైరెక్టర్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ విష్ణు–రామ్‌ అబ్బరాజులది హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘సామజవరగమన’ (2023) ఘన విజయం సాధించింది. ఆ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్‌ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతోంది.

మై త్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట రామ్‌ అబ్బరాజు. ఈ సినిమాకు      ‘ఫ్యామిలీప్యాక్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్‌.

టైటిల్‌కు తగ్గట్టే ఈ మూవీలో కంప్లీట్‌ కామెడీతో పాటు ఎమోషన్స్ ఉంటాయని, కుటుంబ సభ్యులందరూ చూసేలా ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’. జానకిరామ్‌ మారెళ్ల దర్శకుడు. ఈ మూవీలో మహిమా నంబియార్‌ హీరోయిన్‌. కోన వెంకట్‌ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాల షూటింగ్స్‌ కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి.  

– డేరంగుల జగన్‌ మోహన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement