తమ్ముడు చేసిన అభ్యంతకర చర్య అన్నయ్య పెళ్లికి చేటు తీసుకొచ్చింది. పెళ్లి ఆచారాలు జరుగుతున్న సమయంలో వధువు కొంగు (పల్లూ) లాగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో పెళ్లి కొడుకు తలకు తీవ్ర గాయమవ్వగా, పలువురు గాయపడ్డారు. దీంతో పెళ్లి కాస్తా తాత్కాలికంగా ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. అనుకున్న సమయానికి పెళ్లి జరిపించేందుకు పెద్దలు, పురోహితులు సిద్ధంగా ఉన్నారు. అటు పెళ్లి బరాత్ కూడా షెడ్యూల్ ప్రకారమే కల్యాణ మండపానికి చేరుకుంది. వేడుకలు కూడా సజావుగానే సాగుతున్నాయి. అయితే, పెళ్లి చివరి ఘట్టానికి చేరుకున్న సమయంలో, పెళ్లికొడుకు తమ్ముడు పిచ్చి వేషం వేశాడు. కాబోయే వదిన అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఆమె కొంగు పట్టుకొని లాగాడు. అంతే దుమారం రేగింది. వధువు బాబాయ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అలా మొదలైన వివాదం మధ్య తీవ్ర రూపం దాల్చింది. మద్యం సేవించిన మరికొంతమంది బంధువులు దీనికి మరింత ఆజ్యం పోశారు. అంతే ఈ మాటల యుద్ధం కాస్తా క్షణాల్లోనే పరస్పర దాడులుగా మారింది. వరుడు, వధువు తరఫు బంధువు (కజిన్) కూడా గాయపడ్డాడు. గొడవ పెద్దది కావడంతో పెళ్లి ఆచారాలను మధ్యలోనే నిలిపి వేయాల్సి వచ్చింది. ఇరువర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవడి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్, తలలు పగిలాయ్!
గురువారం నాడు గ్రామ సర్పంచ్ సమక్షంలో ఇరు కుటుంబాల వారు పోలీస్ స్టేషన్‌లోనే సుదీర్ఘంగా చర్చలు జరిపారు.ఎట్టకేలకు ఇరువర్గాలు ఒక అవగాహనకు వచ్చాయి. గాయపడిన వారి వైద్య ఖర్చుల కోసం రూ. 4,500 చెల్లించేలా పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తానికి ఇరు కుటుంబాలు శాంతించి, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం వధూవరులను ఒకటి చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఇరువర్గాలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నాయని, ఎవరూ కూడా ఒకరిపై ఒకరు పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దత్తత హిందూ సోదరికి, ముస్లిం వ్యక్తి కన్యాదానం, వైభవంగా పెళ్లి


