ప్రముఖ టీవీ నటి, బిగ్‌బాస్ ఓటీటీ -2 ఫేమ్ పాలక్ పుర్స్వానీ తన చిరకాల ప్రియుడితో ఏడడగులు వేసింది. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్‌లో ప్రియుడు రోహన్ ఖన్నాను పెళ్లాడింది. అంతేకాదు వీరి పెళ్లి 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహం ముందు జరిగిన తొలి ఆధ్యాత్మిక వివాహంగా నిలుస్తోంది. అత్యంత సన్నిహిత వివాహ వేడుకకు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఇవినెట్టింట సందడిగా మారాయి.
కోయంబత్తూరులోని సద్గురు ఈషా ఫౌండేషన్‌లో ఆ పరమశివుని విగ్రహం ముందు జరిగిన ఈ వేడుక నెట్టింట అందరి దృష్టిని ఆకరిస్తోంది. సాధారణంగా వివాహ వేడుకలో వధువు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ వీరి పెళ్లి వేడుక అందుకు భిన్నంగా నిలిచింది. 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహం నేపథ్యంలో ఆ జంట నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా 2014లో టీవీ నటిగా కరియర్‌ను ప్రారంభించిన పాలక్ పుర్స్వానీ 'రూహానియత్', 'బడే భయ్యా కి దుల్హనియా', 'యే రిష్తే హై ప్యార్ కే', 'ఏక్ ఆస్థా ఐసీ భీ', 'మేరీ హానికారక్ బీవీ' 'బడీ దేవరాణి' లాంటి సీరియల్స్, షోలతో పాపులారిటీ సంపాదించుకుంది. 2019లో ఆమె 'నాచ్ బలియే 9', 2023లో 'బిగ్ బాస్ OTT సీజన్ 2'లో కూడా పాల్గొంది.
పాలక్ - రోహన్ లవ్‌స్టోరీ
వీరి బంధం 2024లో మొదలైంది. ఏడాది తిరగకముందే, టర్కీ పర్యటనలో రోహన్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. గత ఏడాది ఏప్రిల్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా తమ పెళ్లి కబురును, ఫోటోలను ఒక ఉమ్మడి పోస్ట్ ద్వారా పంచుకున్నారు ఈ లవ్‌బర్డ్స్.
"కొన్ని ప్రేమకథలను ఆ దేవుడే రచిస్తాడు. మా ప్రేమకథను మహాదేవుడు ఎంపిక చేశారు. రెండు ఆత్మలు... శాశ్వతంగా ఒక్కటయ్యాయి. 26.06.26." అంటూ పోస్ట్ చేశారు.
పాలక్ ఎరుపు , గులాబీ రంగుల కలయికతో ఉన్న పెళ్లి లెహెంగాలో ఎంతో అందంగా కనిపించగా, వరుడు భర్త రోహన్ లేత గోధుమ రంగు (బీజ్) షెర్వానీలో మెరిశాడు.


