ఖమేనీకి ఎదురుదెబ్బ.. అమెరికా షాక్ ట్రీట్‌మెంట్! | US hits Mojtaba Khamenei with fresh sanctions | Sakshi
Sakshi News home page

ఖమేనీకి ఎదురుదెబ్బ.. అమెరికా షాక్ ట్రీట్‌మెంట్!

Jul 11 2026 7:19 AM | Updated on Jul 11 2026 7:25 AM

US hits Mojtaba Khamenei with fresh sanctions

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ టార్గెట్‌గా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖమేనీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు ఆరోపిస్తున్న ఆర్థిక నెట్‌వర్క్‌పై అమెరికా భారీ ఆంక్షలు విధించింది. ఈ చర్యలతో దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఇరానీ వ్యాపారవేత్త, బ్యాంకర్ అలి అన్సారితో పాటు మొత్తం 14 మంది వ్యక్తులు, సంస్థలు అమెరికా ఆంక్షల జాబితాలో చేరాయి.

కాగా, అలి అన్సారి ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు, బ్యాంకులు, పెట్టుబడి సంస్థల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ వ్యవస్థ ద్వారా ఇరాన్ ప్రభుత్వ నిధులను విదేశాలకు మళ్లించి, రియల్ ఎస్టేట్, హోటళ్లు, వాణిజ్య భవనాలు తదితర ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు అమెరికా ఆరోపించింది. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం మొజ్తబా ఖమేనీకి అనుబంధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు, అలాగే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నట్లు పేర్కొంది.

తాజా ఆంక్షల పరిధిలో ఇరాన్‌కు చెందిన మూడు కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్‌లో నమోదైన పలు ఫ్రంట్ కంపెనీలు కూడా ఉన్నాయి. షెల్ కంపెనీల ద్వారా ప్రతి ఏడాది బిలియన్ల డాలర్ల విలువైన లావాదేవీలు నిర్వహిస్తూ అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు ఈ నెట్‌వర్క్ పనిచేస్తోందని అమెరికా ఆరోపించింది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధిలో ఇటీవల వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల తర్వాత ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

లావాదేవీలు కట్‌.. 
అయితే, ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచి, దాని ఆర్థిక వనరులను దెబ్బతీయడమే తాజా ఆంక్షల ప్రధాన ఉద్దేశమని అమెరికా స్పష్టం చేసింది. ఈ ఆంక్షల కారణంగా జాబితాలో ఉన్న వ్యక్తులు, సంస్థలకు అమెరికాలో ఉన్న ఆస్తులు స్తంభించి పోనున్నాయి. అమెరికా పౌరులు, సంస్థలు వారితో ఎలాంటి ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. అలాగే ఇతర దేశాల బ్యాంకులు లేదా కంపెనీలు వీరితో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే ద్వితీయ స్థాయి ఆంక్షలను ఎదుర్కొనే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.

ఇదిలా ఉండగా.. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక, దౌత్య విభేదాల నేపథ్యంలో తాజా ఆంక్షలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, అమెరికా చేసిన ఆరోపణలను ఇరాన్ గతంలో పలుమార్లు ఖండించింది. తమపై విధిస్తున్న ఆంక్షలు రాజకీయ ఒత్తిడి కోసం చేస్తున్న చర్యలేనని, అవి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఇరాన్ వాదిస్తోంది. తాజా ఆంక్షలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement