పునర్వినియోగ  బూస్టర్‌ అభివృద్ధిలో చైనా విజయం  | China recovered its first reusable rocket and showed a new way | Sakshi
Sakshi News home page

పునర్వినియోగ  బూస్టర్‌ అభివృద్ధిలో చైనా విజయం 

Jul 11 2026 4:40 AM | Updated on Jul 11 2026 4:40 AM

China recovered its first reusable rocket and showed a new way

బీజింగ్‌: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా అరుదైన ఘనత సాధించింది. ఎలాన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌–ఎక్స్‌ తరువాత మళ్లీమళ్లీ వాడగల రాకెట్‌ బూస్టర్లను అభివృద్ధి చేయగలిగింది. చైనా హైనాన్‌ ప్రావిన్స్‌ నుంచి శుక్రవారం ఆకాశానికి ఎగిరిన లాంగ్‌ మార్చ్‌–10బి నిర్దేశిత కక్ష్యలో పేలోడ్‌ను చేర్చినట్లు చైనా వార్తా పత్రిక జిన్‌హువా తెలిపింది. అయితే ఇదే ప్రయోగంలో రాకెట్‌ మొదటి దశ బూస్టర్‌ను నియంత్రిత పద్ధతిలో పొందడంలోనూ విజయం సాధించింది. రాకెట్‌ నుంచి మొదటి, రెండవ దశలు విడిపోయిన తరువాత మొదటి దశ బూస్టర్‌ సముద్రంపై ఏర్పాటు చేసిన ఒక ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థలో సురక్షితంగా వాలింది. 

మళ్లీ మళ్లీ వాడగల రాకెట్‌ బూస్టర్ల అభివృద్ధిలో ఇదో కీలక ఘట్టం. చైనా గత డిసెంబర్‌లోనూ రెండు పునర్వినియోగ రాకెట్‌ బూస్టర్లను ప్రయోగించినప్పటికీ అవి స్పేస్‌ ఎక్స్‌ రాకెట్ల మాదిరిగా నిట్టనిలువుగా నేలను చేరడంలో విఫలమైనట్లు హాంకాంగ్‌లోని సౌత్‌ చైనా మార్నీంగ్‌ పోస్ట్‌ తెలిపింది. ఈసారి మాత్రం ప్రయోగం, బూస్టర్‌ రికవరీ రెండూ విజయవంతంగా పూర్తయ్యాయి. లాంగ్‌ మార్చ్‌–10బి రాకెట్‌ సుమారు 63 మీటర్లు ఎత్తు, ఐదు మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. మోసుకెళ్లగల పేలోడ్‌ సామర్థ్యం16 టన్నులు. మొదటి దశ బూస్టర్‌ సముద్ర ప్లాట్‌ఫామ్‌పై దిగుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement