ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హ్యూమనాయిడ్ రోబోలు (మనుషుల్లా వ్యవహరించేవి) ఒకటి కాదు.. రెండు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (శాన్‌డియాగో) శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. ఒక ఆపరేషన్‌లో సర్గీ అనే రోబోను ఒక వైద్యుడు రిమోట్ కంట్రోలర్ సాయంతో పని చేయించి పిత్తాశయాన్ని (గాల్‌బ్లాడర్) తొలగించగా... రెండు హ్యూమనాయిడ్ రోబోలు తమలో తాము మాట్లాడుకుంటూ రెండో ఆపరేషన్‌ను పూర్తి చేశాయి.
ఈ ప్రయోగం వివరాలు అంతర్జాతీయ ప్రఖ్యాత సైన్స్ జర్నల్ ‘నేచర్’జూలై ఎనిమిదవ తేదీ సంచికలో ప్రచురితమయ్యాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోబోలతో శస్త్రచికిత్సలు చేయించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. తరచూ ఇలాంటి వార్తలు చదువుతూనే ఉంటాం. అయితే ఇందులో చాలా పరిమితులున్నాయి. మొదటగా వీటి బరువు ఇంట్యూటివ్ సర్జికల్స్ వారి డావిన్సీ సర్జికల్ సిస్టమ్ 820 కిలోల వరకూ బరువు ఉంటే సీఎంఆర్ సర్జికల్స్‌కు చెందిన వెరిసియస్ 450 కిలోలు ఉంటుంది. మెడ్‌ట్రానిక్ కంపెనీ తయారు చేసిన హ్యూగో ఆర్‌ఏఎస్ సుమారు 540 కిలోల బరువు ఉంటుంది.
వీటిని ఆపరేషన్ థియేటర్లలో అమర్చడం పని చేయించడం కష్టమైన వ్యవహారం. ప్రత్యేక నైపుణ్యాలున్న సిబ్బంది అవసరం. పైగా ఒక్కోటి కొన్ని రకాల సర్జరీలు మాత్రమే చేయగలదు.హ్యూమనాయిడ్ రోబోలు ఈ పరిమితులన్నింటినీ అధిగమించగలవని అంచనా. కాలిఫోర్నీయా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఉపయోగించిన హ్యూమనాయిడ్ రోబో సర్గి ఐదు అడుగుల ఎత్తు, సుమారు 27 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్‌కు నడుచుకుని రాగలదు. సర్జికల్ రోబోలతో పోలిస్తే చౌక. ప్రపంచంలో ఏ మూలలోనైనా ఇట్టే ఉపయోగించవచ్చు.
పేద, మధ్యాదాయ దేశాల్లో, వనరులు, వసతులు తక్కువగా ఉన్నచోట్ల ఈ హ్యూమనాయిడ్ రోబోలు ప్రాణాలు నిలిపే కీలకమైన శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఎంతో ఉపయోగపడతాయని కాలిఫోర్నీయా వర్సిటీ ఇంజినీర్ మైకెల్ ఇప్ తెలిపారు. సర్జరీకి అవసరమైన కత్తులు, ఇతర పరికరాలను పట్టుకునేందుకు అడాప్టర్లను ప్రత్యేకంగా తయారు చేశామని, వీటితో పనిచేయించడం పెద్ద కష్టమేమీ కాలేదని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న సర్జన్ నికితా తరేజా తెలిపారు. ఈ హ్యూమనాయిడ్ రోబోలు ఆపరేషన్ థియేటర్‌లో ఎంత బాగా సర్దుకుపోయాయో చూసి ఆశ్చర్యపోయామన్నారు. తొలి ఆపరేషన్‌లో సెర్గిని పదే పదే రీకాలిబరేట్ చేయాల్సి వచ్చిందని, దీనివల్ల కొంత ఎక్కువ సమయం పట్టిందని వివరించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


