పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య రెండు రోజుల పాటు భీకర దాడులు కొనసాగాయి. అయితే.. ఆ శాంతి చర్చలను మళ్లీ పట్టాలెక్కించేందుకు మధ్యవర్తి దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం తాత్కాలికంగా ఆగిందని సమాచారం.
అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన పరస్పర దాడులతో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు చర్చల దిశగా అడుగులు వేస్తున్నట్లు అల్‌జజీరా ఓ కథనం ఇచ్చింది. అందులో.. వాషింగ్టన్ ఇప్పటికీ ఇరాన్‌తో చర్చలకు కట్టుబడి ఉందని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సాంకేతిక స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే విషయాన్ని మొదటి నుంచి చెబుతున్నట్లు గుర్తు చేశారాయన.
ఇవాళ.. కొత్తగా దాడులేం జరగలేదు. అంతకు ముందు బుషెహర్ సైనిక స్థావరం వద్ద బాంబుల మోత మోగింది. అయితే అమెరికా-ఇజ్రాయెల్ తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాయి.
ఖతార్ చొరవతో..
అమెరికా-ఇరాన్ ఘర్షణను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తిత్వ ప్రయత్నం చేస్తోంది. ఘర్షణలకు పరిష్కారం కేవలం దౌత్యం, చర్చల ద్వారానే సాధ్యమని ఖతార్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాశ్వత భద్రత, స్థిరత్వం కోసం సంభాషణలు, దౌత్య మార్గాలకే తమ దేశం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. లండన్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో..
అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితి చాలా చల్లబడ్డప్పటికీ.. లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని నబాతియే ప్రాంతంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరిగింది. చెత్తను తరలిస్తున్న ఓ వాహనంపై జరిగిన ఈ దాడిలో ఇద్దరు గాయపడినట్లు లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. షుకిన్, కఫర్ దజ్జల్ ప్రాంతాల సమీపంలో ఉదయం ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో మార్చి 2 నుంచి ఇప్పటివరకు 4,321 మంది మరణించగా.. 12,203 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 26న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య దళాల ఉపసంహరణకు సంబంధించి ఒప్పందం కుదిరినప్పటికీ.. తాజా దాడి ఆందోళన కలిగిస్తోంది.
చర్చలే కీలకం
అమెరికా-ఇరాన్ మధ్య తాజా పరిణామాలు తాత్కాలిక శాంతి సంకేతాలను ఇస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయి కాల్పుల విరమణ, దీర్ఘకాలిక ఒప్పందంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత, పరస్పర నమ్మకం వంటి అంశాలపై చర్చలు కీలకంగా మారనున్నాయి. రెండు రోజుల దాడుల తర్వాత ఇప్పుడు తుపాకులు మౌనంగా ఉన్నా.. శాంతి శాశ్వతమవుతుందా? అన్నది రాబోయే దౌత్య చర్చలపైనే ఆధారపడి ఉంది.


