ఇరాన్ రైల్వే వంతెనలను నాశనంచేసిన అమెరికా సేన
తొలిసారిగా చాబహార్ నౌకాశ్రయంపై మెరుపు దాడి
మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ధ్వంసం
బుషెహర్‌లోని అణు విద్యుత్ కేంద్రం సమీపంలోనూ పేలుళ్లు
ప్రతిగా అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు
దుబాయ్: చర్చలతో తేలదని, బాంబులతోనే తేల్చుకుంటామని ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపించి పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధాగ్నిని ప్రజ్వరిల్లజేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో రెండోరోజూ ఇరాన్‌పై అగ్రరాజ్యసేనలు విరుచుకుపడ్డాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధాగారాలు, ఎయిర్‌పోర్ట్ రన్‌వేలతోపాటు ఈసారి మౌలిక వసతులపై అమెరికా గురిపెట్టింది. దీంతో ఇరాన్‌లోని రైల్వేలైన్లు, వంతెనలు, నౌకాశ్రయాలు దాడుల బారిన పడ్డాయి.
గత 48 గంటల్లో ఇరాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు, క్షిపణి స్థావరాలు, సైనిక స్పీడ్ బోట్లు, మౌలికవసతులు ఇలా మొత్తంగా కీలకమైన 170 లక్ష్యాలపై దాడులు చేశామని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ గురువారం ప్రకటించింది. హార్మూజ్ జలసంధి గుండా సరకు రవాణా నౌకల స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింతగా దెబ్బతీసే లక్ష్యంతోనే దాడులు చేస్తున్నామని సెంట్రల్ కమాండ్ స్పష్టంచేసింది.
తొలిసారిగా చాబహార్ నౌకాశ్రయం మీదా దాడి చేసింది. నౌకల రాకపోకలను నియంత్రించే షాహీద్ బెహెప్తి మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ సైతం ధ్వంసమైంది. చాబహార్‌లోని ఇరాన్ నేవీకి చెందిన ఇమామ్ అలీ స్థావరంపైనా అమెరికా యుద్ధవిమానాలు బాంబులు జారవిడిచాయి. బందర్ అబ్బాస్ నౌకాశ్రయం సమీపంలో ఎనిమిది పేలుళ్లు జరిగాయి. అబూ మూసా ద్వీపంపైనా అమెరికా దాడిచేసింది.
బుషెహర్‌లోని అణు విద్యుత్‌కేంద్రం సమీపంలో గురువారం మధ్యాహ్నం బాంబుల శకలాలు పడ్డాయని ఇరాన్ ప్రకటించింది. అయితే దాడిలో న్యూక్లియర్ ప్లాంట్‌కు ఏమైనా నష్టం జరిగిందా లేదా అనే వివరాలను ఇరాన్ వెల్లడించలేదు. దాడుల కారణంగా ఆ ప్రాంతంలో రేడియోధార్మికత పెరిగినట్లు ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. గతంలోనూ ఈ ప్రాంతంలో అమెరికా బాంబులేసింది. ఇరాన్‌లో రష్యా సాంకేతికనిపుణుల సాయంతో నడుస్తున్న ఏకైక అణువిద్యుత్‌కేంద్రం ఇదొక్కటే. గురువారం నైరుతి ఇరాన్‌లోని ఖుజెస్తాన్‌లో జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇరాన్‌షెహర్ ఎయిర్‌పోర్ట్‌లో దాడిలో అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు చనిపోయారు. గత 48 గంటల్లో అమెరికా దాడులతో ఇరాన్‌లో మరణాల సంఖ్య ముగ్గురు ఐఆర్‌జీసీ సభ్యులతో కలిపి 14కు పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 78 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ తెలిపారు. తాజాగా దాడులు మొదలయ్యాక మృతులు, క్షతగాత్రుల వివరాలను ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఈశాన్య ఇరాన్‌లోని గోలెస్తాన్ ప్రావిన్స్‌లో అఖాలా పరిధిలో అగ్ తెఖెన్‌ఖాన్ రైల్వే వంతెనను అమెరికా క్షిపణిదాడులతో పేల్చేసింది.
మష్హాద్ నగరంలో ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ ఖననప్రక్రియను చూసేందుకు దేశరాజధాని టెహ్రాన్ నుంచి తరలివచ్చే జనం ఈ కీలక రైల్వేమార్గంలోనే వస్తారు. కార్యక్రమానికి భారీస్థాయిలో జనం హాజరుకాకుండా అడ్డుకునేందుకే రైల్వేలైన్‌ను అమెరికా పేల్చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఉత్తర ఇరాన్‌ను చైనా, రష్యా, తుర్క్‌మెనిస్తాన్‌లతో అనుసంధానించే ఓగ్టే ఖాన్ రైల్వే వంతెననూ అమెరికా పేల్చేసింది. మౌలిక వసతులపై దాడిచేసి అమెరికా ఘోరమైన యుద్ధనేరాలకు పాల్పడుతోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
దీటుగా బదులిచ్చిన ఇరాన్..
మెరుపుదాడులకు ఇరాన్ సైతం దీటుగా బదులిచ్చింది. అమెరికా మిత్రదేశాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా నావికాదళ 5వ ఫ్లీట్‌కు ప్రధాన కార్యాలయమైన బహ్రెయిన్‌లోని ప్రధాన స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. కువైట్, ఖతర్‌ల మీదా ఇరాన్ దాడులుచేసింది. అమెరికా సైన్యం, యుద్ధవిమానాలకు స్థావరంగా మారిన జోర్డాన్ మీదా ఇరాన్ తన ప్రతాపం చూపించింది. అజ్రాక్‌లోని మువాఫాక్ సాల్తీ అమెరికా విమానస్థావరంపై 10 క్షిపణులు పడ్డాయి.
దీంతో జనం సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తూ పలు మార్లు సైరన్లు మోగాయి. దీంతో దాడుల భయంతో జనం పరుగులుతీశారు. గగనతలంలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లు కన్పించడంతో అమెరికా పౌరులు సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలని జోర్డాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఎనిమిది ఇరాన్ క్షిపణులను నేలమట్టంచేశామని జోర్డాన్ ప్రకటించింది. అయితే దాడులు కొనసాగితే పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన ఏ ఒక్క స్థావరం కూడా సురక్షితంగా ఉండబోదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) గురువారం హెచ్చరించింది.
హార్మూజ్ గుండా తగ్గిన నౌకల రవాణా..
తాజా దాడులతో హార్మూజ్ గుండా సరకు రవాణా నౌకల రాకపోకలు తగ్గిపోయాయి. యుద్ధం మొదలుకాకముందు ఈ మార్గంలో ప్రతి 24 గంటల్లో ఏకంగా 130 నౌకలు వెళ్లేవి. గత వారం సైతం రోజుకు 70 నౌకలు వెళ్లేవి. గురువారం ఆ సంఖ్య పదిలోపునకు పడిపోయిందని ఇంటర్‌ట్యాంకో సంస్థ మెరైన్ డైరెక్టర్ ఫిల్ బెల్షెర్ చెప్పారు.


