ఎరక్కపోయి ఎక్కారు..  ఇరుక్కుపోయారు!  | Two teens are detained after joy ride in Waymo self-driving car | Sakshi
Sakshi News home page

ఎరక్కపోయి ఎక్కారు..  ఇరుక్కుపోయారు! 

Jul 10 2026 1:24 AM | Updated on Jul 10 2026 1:24 AM

Two teens are detained after joy ride in Waymo self-driving car

కాలిఫోర్నీయా: పాపం కుర్రాళ్లు...కారెక్కారు... ఇద్దరూ చీర్స్‌ చెప్పుకుని చిల్‌ అవుతున్నారు! కిటికిలోంచి వాటర్‌ గన్స్‌ ఎక్కుపెట్టి... సరదాగా నీటి బుల్లెట్లు ఫైర్‌ చేస్తున్నారు. అంతా బాగుంది కానీ.. వాళ్లు చేసిన తప్పల్లా ఒక్కటే... సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వేమో సర్వీసును ఎంచుకోవడం! 

అమెరికాలోని కాలిఫోర్నీయా నగరంలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. వేమో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాన్ని ఎక్కిన ఇద్దరు టీనేజర్లను ఆ కారే పోలీసులకు పట్టించింది. ఎందుకని చూస్తే.. కారులో వాళ్లు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని వేమో పోలీసులకు సమాచారం ఇచ్చిందట. ఏంటా అనుమానాస్పద చర్యలు అని విచారిస్తే... మద్యం తాగుతున్నట్టుగా అనిపించిందని, చేతిలో వాటర్‌గన్స్‌ను తుపాకులుగా భావించిందని స్పష్టమైంది. 

కారులో ఉన్న కెమెరాలు, మైక్రోఫోన్స్‌తో ఆ ఇద్దరు టీనేజర్ల చర్యలన్నీ గమనించిన వేమో అటానమస్‌ డ్రైవింగ్‌ వ్యవస్థ దగ్గరలో ఉన్న పార్కింగ్‌ లాట్‌లో కారు నిలిపేసింది. లోపలివారు బయటకు వెళ్లకుండా అన్నిపక్కలా లాక్‌లు వేసేసింది. పోలీసులకు కాల్‌ చేసింది. దీంతో ఐదుగురు అధికారలు ఒక పోలీసు కుక్క ఆ కారును చుట్టుముట్టాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయింది. చివరకు పోలీసులు కుర్రాళ్ల చేతుల్లో ఉన్నది వాటర్‌గన్‌లు అని నిర్ధారించుకున్నారు. 

అయినప్పటికీ వాటిని కిటికీల్లోంచి ఎక్కుపెట్టడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశముందని, స్పీడ్‌గా షూట్‌ చేస్తే వాటర్‌గన్‌ల ద్వారా కూడా తీవ్ర గాయాలవుతాయని చెబుతూ వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఇప్పుడు రెండు రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొందరు పాపం కుర్రాళ్లు.. పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూంటే... ఇంకొందరు మాత్రం వేమో మంచి పని చేసిందని మెచ్చుకుంటున్నారు. డ్రైవర్ల అవసరం లేని కార్లతో వచ్చే చిక్కుల్లో ఇదీ ఒకటన్నమాట!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement