బహ్రెయిన్, కువైట్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు
80కి పైగా ఇరాన్ లక్ష్యాలపై దాడి చేశామన్న అమెరికా
దుబాయ్: పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ సైన్యం బుధవారం తెల్లవారుజామున బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. హార్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు చేసిందంటూ అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకారంగా ఇరాన్ చమురు విక్రయాలపై ఆంక్షలు విధించింది. లైసెన్స్‌ను రద్దు చేసింది. రాత్రిపూట ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడింది.
హార్మూజ్‌లో సాధారణ పౌరులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేసి, వాటికి నష్టం కలిగించినందుకు అమెరికా దళాలు ఇరాన్‌పై దాడులు చేశాయని యూఎస్ మిలటరీ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్లు, పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ ఉపయోగించే 80కి పైగా చిన్న పడవలతో సహా పలు లక్ష్యాలపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ విరుచుకుపడింది.
ఈ దాడుల్లో అమెరికా స్థావరాలకు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది తెలియరాలేదు. బహ్రెయిన్ తన క్షిపణి హెచ్చరిక సైరన్‌ను మోగించింది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. మరోవైపు అమెరికా దుందుడుకు చర్యపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఖలీబాఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘బెదిరింపులు, బలవంతపు వసూళ్ల శకం ముగిసింది’’అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఖలీబాఫ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా దాడులకు, ఒత్తిల్లకు తలవంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.


