breaking news
self-driving car
-
ఏవీ.. డ్రైవర్ లేకుండానే!
అమెరికాలోని ఆస్టిన్ నగర వీధుల్లో ఒక ఎర్ర కారు.. దానిమీద ‘రోబో ట్యాక్సీ’ అని రాసి ఉంది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ లేదా డ్రైవర్ రహిత కారు. ప్రపంచ ప్రసిద్ధ టెస్లా కంపెనీ ఈ రోబో ట్యాక్సీ సేవలను ఆదివారం ప్రారంభించింది. దీంతో ఇప్పుడు స్వయం చోదక వాహనాల (అటానమస్ వెహికల్ –ఏవీ) మీద చర్చ మరోసారి మొదలైంది. యూఎస్ఏలోని సిలికాన్ వ్యాలీ, చైనాలోని బీజింగ్ నగరంలో ఇప్పటికే ఏవీలు పరుగులు తీస్తున్నాయి. సరుకు రవాణా కోసం అటానమస్ ట్రక్స్ దూసుకెళుతున్నాయి. ప్రపంచంలో వాహనాల తయారీలో నాలుగో స్థానంలో ఉన్న భారత్‌లో.. ఏవీలు సాకారం అయ్యే అవకాశాలు ఎప్పుడెప్పుడా అని వాహన ప్రియులు ఎదురుచూస్తున్నారు. అసలు ఏవీలు ఎక్కడెక్కడ ఏయే స్థాయిల్లో ఉన్నాయి.. ఏవీ ఎలా పనిచేస్తుంది.. డ్రైవర్ లేకుండా ఇది ఎలా నడుస్తుంది?విదేశాల్లో ఇలా..సాధారణ క్యాబ్స్‌తో పోలిస్తే పలు దేశాల్లో అటానమస్ వెహికల్స్ ఆధారిత క్యాబ్స్ సగం చార్జీలనే వసూలు చేస్తున్నాయి. ఒక్క యూఎస్‌లోనే ఒక ట్రిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఊబర్ సీఈవో డారా కాస్రోసాహీ ఇటీవల వెల్లడించారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు చెందిన వేమో ఇప్పటికే యూఎస్, చైనాలో అటానమస్ వెహికల్స్‌తో రైడ్ హెయిలింగ్ సేవలు ఆఫర్ చేస్తోంది.యూఎస్‌కు చెందిన పోనీ.ఏఐ అటానమస్ క్యాబ్స్ సర్వీసులు అందిస్తోంది. అలాగే అటానమస్ ట్రక్స్ ద్వారా సరుకు రవాణా రంగంలోనూ ఉంది. భారత్‌కు చెందిన గౌతమ్ నారంగ్, అర్జున్ నారంగ్, అపేక్ష కుమావత్ కలిసి అమెరికాలో ఏర్పాటుచేసిన ‘గతిక్.ఏఐ’ అనే కంపెనీ అటానమస్ ట్రక్స్ ద్వారా వాల్‌మార్ట్ వంటి కంపెనీలకు సేవలందిస్తోంది. న్యూరో అనే కంపెనీ చిన్న అటానమస్ వ్యాన్స్ ద్వారా యూఎస్‌లో సరుకు రవాణా చేస్తోంది. చైనాలో డీప్రూట్.ఏఐ ఈ రంగంలో ఉంది. వీరైడ్, వాబి, మోషనల్, అరోరా తదితర కంపెనీలు సైతం ఆటానమస్ వెహికల్స్‌తో పోటీపడుతున్నాయి.అమెరికాలోని ఆస్టిన్ నగరంలో టెస్లా కంపెనీకి చెందిన రోబో ట్యాక్సీలను లాంఛనంగా ప్రారంభించారు. దశాబ్దాల కఠోర శ్రమకు ఇది ఫలితమని, అయితే ఇది పైలట్ ప్రాజెక్టేనని టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ తెలిపారు. ప్రస్తుతం ట్రిప్పునకు 4.20 డాలర్లు (సుమారు రూ.364) వసూలు చేస్తున్నారు. ఈ క్యాబ్స్ పూర్తిస్థాయిలో ప్రజలందరికీ ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో మస్క్ ఇంకా ప్రకటించలేదు. మనదేశం విషయానికొస్తే.. టాటా మోటార్స్ ఇటీవల వైయు అనే పూర్తిస్థాయి అటానమస్ వాణిజ్య వాహనానికి పేటెంట్ పొందింది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది వస్తువులు, ప్రయాణికుల రవాణాకు అనుకూలమైనది.మన దేశంలో ప్రారంభ దశలోనే..అటానమస్ వెహికల్స్ రాకతో ఆటోమొబైల్ పరిశ్రమలో సాంకేతికంగా పెద్ద ముందడుగు పడిందని చెప్పవచ్చు. భారత్‌లో అటానమస్ వెహికల్స్ అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్పాలి. పూర్తిగా అటానమస్ అంటే డ్రైవర్ అవసరమే లేకుండా నడిచే వాహనాలు (లెవెల్–5) ఇంకా వాణిజ్యపరంగా అందుబాటులో లేనప్పటికీ.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) అభివృద్ధి, అటానమస్ దిశగా సాంకేతికతల పరీక్షల్లో పురోగతి ఉంది. భారత్‌లో మైనస్ జీరో, స్వాయత్ రోబోస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా ఈలిక్సీ, ఫ్లక్స్ ఆటో, ఫ్లో మొబిలిటీ తదితర కంపెనీలు ఏవీల అభివృద్ధిపై దృష్టి సారించాయి. ఇదిలా ఉంటే.. డ్రైవర్‌లెస్ కార్లను భారత్‌లో అనుమతించేది లేదని పలు సందర్భాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెబుతూ వచ్చారు.5 లెవెల్స్‌లో..వాహనాల నియంత్రణ, నిర్వ హణ విషయంలో ఆటో మేషన్ స్థాయిని బట్టి లెవెల్–0 నుంచి పూర్తి అటానమస్ లెవల్–5 వరకు.. ఏవీలను 6 స్థాయిలుగా వర్గీకరించారు. లెవెల్ – 0 అంటే పూర్తిగా డ్రైవర్‌పైనే ఆధారపడి ఉంటుంది. లెవెల్ – 1లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ముందున్న వాహనం వేగాన్ని బట్టి ఏవీ దానంతట అదే వేగాన్ని నియంత్రించుకుంటుంది. లెవెల్ – 2లో సాంకేతికత స్టీరింగ్‌ను, వేగాన్ని నియంత్రిస్తుంది. లెవెల్ 1, 2లలో కచ్చితంగా డ్రైవర్ ఉండాల్సిందే. లెవెల్ –3లో ప్రత్యేక పరిస్థితుల్లో వాహనం దానంతట అదే నియంత్రించుకుంటుంది.కానీ, కొన్ని సందర్భాల్లో కారు ఇచ్చే అలర్ట్స్‌ను బట్టి డ్రైవర్ స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. లెవెల్ –4 అంటే.. చాలా అరుదుగా తప్ప, దాదాపుగా డ్రైవర్ అవసరం లేకుండానే కారు నడుస్తుంది. వీటిని ఎక్కడ పడితే అక్కడ నడపడం సాధ్యం కాదు. ప్రత్యేకమైన ప్రాంతంలోనే (జియో ఫెన్సింగ్ సాయంతో) నడుపుతారు. అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి వివరాలే ఫీడ్ చేస్తారన్నమాట. ఆ పరిస్థితుల్లోనే కారు నడవగలదు. లెవెల్ – 5.. అసలు డ్రైవర్ అవసరమే ఉండదు. పూర్తిగా కారు తనంతట తానే నడుస్తుంది. ప్రపంచంలో లెవెల్ – 5 స్థాయి వాహనాలను ఎవరూ తయారుచేయలేదు. సెన్సార్స్, కెమెరాలతో..అటానమస్ వెహికల్స్ వాటి పరిసరాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి రూట్ మ్యాప్‌ను నిర్మించడానికి, నవీకరించడానికి పలు సెన్సార్లపై ఆధారపడతాయి.⇒ రాడార్ సెన్సార్లు సమీపంలోని వాహనాలను ట్రాక్ చేస్తాయి. కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గుర్తిస్తాయి. అలాగే రహదారి సంకేతాలను అర్థం చేసుకుంటాయి. పాదచారులు, ఇతర వాహనాల కదలికలను గమనిస్తుంటాయి. ⇒ లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సాంకేతికత దూరాలను కొలవడానికి; లేన్ గుర్తులను, రహదారి సరిహద్దులను గుర్తించడానికి లేజర్ పల్స్‌లను ఉపయోగిస్తుంది. వాహనం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అధిక రిజొల్యూషన్ 3డీ మ్యాప్‌గా సృష్టిస్తుంది. అడ్డంకులు, పాదచారులు, ఇతర వాహనాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ⇒ వాహనాలను నిలిపేందుకు నిర్దేశించిన గీతలను, చుట్టూ ఉన్న కార్లను గుర్తించేందుకు చక్రాల దగ్గర పొందుపరిచిన అల్ట్రాసోనిక్ సెన్సార్లు సహాయపడతాయి. ⇒ ట్రాఫిక్ సంకేతాలు, పాదచారుల సమాచారాన్ని ఇతర కెమెరాలు అందిస్తాయి. ⇒ ఏవీల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), ఇనెర్షియల్ మెజర్మెంట్ యూనిట్ (ఐఎంయూ) కూడా ఉన్నాయి. లొకేషన్ కు సంబంధించిన సమాచారాన్ని జీపీఎస్ అందిస్తుంది. వాహన వేగం, దిశలో వచ్చే మార్పును ఐఎంయూ ట్రాక్ చేస్తుంది.⇒ సెన్సార్స్ అందించిన డేటాను అత్యంత సామర్థ్యం గల సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేస్తుంది. ఇది సరైన మార్గాన్ని నిర్ణయించడంతోపాటు వాహన వేగం, దిశ, బ్రేకింగ్, స్టీరింగ్‌ను నియంత్రిస్తుంది. ముందే పొందుపరిచిన ట్రాఫిక్ నియమాలు, అడ్డంకులను గుర్తించే విధానాలు, పరిసరాల అధ్యయనం, మనుషులు, యంత్రాల గుర్తింపు ద్వారా ఈ సాంకేతిక వ్యవస్థ సురక్షిత, సమర్థవంత ప్రయాణాన్ని అందిస్తుంది. -
కారు ఒకరిది.. డాబు వాళ్లది
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో కార్లను అద్దెకు తీసుకోని తాకట్టు పెడుతున్న ఇద్దరు ఘరానా నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. వారి నుంచి రూ. 2.50 కోట్ల విలువ చేసే 15 కార్లను స్వాదీనం చేసుకున్నారు. ఆయా వివరాలను మల్కాజ్గిరి డీసీపీ జానకి బుధవారం విలేకరుల సమావేశం లో వెల్లడించారు. ఖమ్మం జిల్లా తాళ్లగూడెం గ్రామానికి చెందిన బొల్లు రాజేష్ హైదరాబాద్‌కు వలస వచ్చి , ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉంటూ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చిన్న పలుగుతండాకు చెందిన బానోతు నరేందర్ అలియాస్ నాగేంద్ర ఘాట్ కేసర్ లోని కొర్రెముల గ్రామంలో నివాసం ఉంటున్నాడు. వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన ఇరువురూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో పథకం ప్రకారం రాజేష్ తానొక బ్యాంకు వెండర్ అని ప్రచారం చేసుకుంటూ.. కార్లను అద్దెకు తీసుకుంటానని అమాయకులను నమ్మించేవాడు. నెలకు రూ.60 వేలు అద్దె చెల్లిస్తానని చెప్పి యజమానుల నుంచి కార్లు అద్దెకు తీసుకునేవాడు. ఆ తర్వాత కారు యజమానులతో కమ్యూనికేషన్ కట్ చేసేవాడు. ఓనర్లు వాహనాలను ట్రాకింగ్ చేయకుండా కార్లలోని జీపీఎస్ వ్యవస్థను ధ్వంసం చేసేవారు. ఆపై వారి కంట పడకుండా తప్పించుకొని తిరిగేవారు. ఈ కార్లను తెలిసిన వాహన డీలర్లు, వర్తకుల వద్దకు తీసుకెళ్లి, సొమ్ము అత్యవసరం ఉందని చెప్పి వారిని నమ్మించేవారు. కారుతో పాటు ప్రామిసరీ నోటు, చెక్‌లను తనఖాగా పెట్టి వారి నుంచి సొమ్ము తీసుకునేవారు. ఇలా ఇప్పటివరకు ఇరువురు నిందితులు 13 మంది అమాయకులను మోసం చేసి, 15 వాహనాలను తనఖా పెట్టి, రూ.30 లక్షలు సొమ్ము చేసుకున్నారు. ఉప్పల్ పీఎస్ పరిధిలో 6 కార్లు, మేడిపల్లిలో 2, చైతన్యపురిలో 2, ఖైరతాబాద్ పీఎస్ పరిధిలో 5 కార్లు తాకట్టు పెట్టిన కేసులు నమోదయ్యాయి. దీంతో ఉప్పల్ పోలీసులు నిందితులు రాజేశ్, నరేందర్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి 9 ఇన్నోవాలు, 2 స్విట్ డిజైర్లు, 2 టొయోటో ఎటియోస్, ఒకటి ఇన్నోవా క్రిస్టా, ఒకటి బాలెనో కార్లను స్వాదీనం చేసుకున్నారు. -
టెస్లాను వెంటాడుతున్న కష్టాలు
మన టైమ్ బాగలేకపోతే దరిద్రం మన ఇంటి డోర్ దగ్గరే పలకరిస్తుంది. ఇప్పుడు ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా పరిస్థితి అలాగే ఉంది. వారం రోజుల నుంచి టెస్లా షేర్ ధర భారీగా పడిపోయిన సంగతి తేలిసిందే. టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ బీటా కారును టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్(ఎఫ్‌ఎస్‌డి) బీటా టెస్లా మోడల్ వై కారు లాస్ ఏంజిల్స్ నగరంలో క్రాష్ అయింది. ఈ ఎలక్ట్రిక్ కారు అదృష్టవ శాస్తు ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కానీ, ఎలక్ట్రిక్ కారు భారీగా దెబ్బతింది. ఈ క్రాష్ గురుంచి నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ కు నివేదించారు. ఇది టెస్లా ఆటోపైలెట్ సిస్టమ్ కారును ఎన్నోసార్లు పరీక్షించారు. అలాగే, అనేక సార్లు ఓవర్ ల్యాపింగ్ పరిశోధనలను జరిపినట్లు ది వెర్జ్ నివేదించింది. అది అలా ఉంటే, కారు యజమాని తెలిపిన నివేదిక ప్రకారం "వాహనం ఎఫ్‌ఎస్‌డి బీటా మోడ్‌లో ఉంది. కారు ఎడమ వైపు మలుపు తీసుకునేటప్పుడు అదుపుతప్పి సందులోకి దూసుకెళ్లింది. ఆ లేన్ పక్కన ఉన్న సందులో మరొక డ్రైవర్ ఈ కారును ఢీ కొట్టాడు". అప్పటికే ఆ కారులో డ్రైవర్ నియంత్రించే పని చేసిన అదుపులోకి రాలేదు అని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై కంపెనీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. (చదవండి: ఎలన్ మస్క్ దెబ్బకు.. వారంలో రూ.13 లక్షల కోట్లు ఆవిరి) -
సెల్ఫ్ డ్రైవింగ్ ఇంజనీరింగ్‌లో ఉద్యోగులకు శిక్షణ
సాక్షి, బెంగళూరు: దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు సెల్ఫీ డ్రైవింగ్ కార్ ఇంజనీరింగ్‌పై గ్లోబల్ శిక్షణా సంస్థ ఆధర్వంలో ట్రైనింగ్ ఇప్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఐటి ఆన్‌లైన లెర్నింగ్ సంస్థ ఉడాసిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెల్ఫీ డ్రైవింగ్ కార్ ఇంజనీరింగ్ పై ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆన్ లైన్ నానో డిగ్రీ శిక్షణకు శ్రీకారం చుట్టింది. ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఉడాసిటీ ఉడాసిటీ కనెక్ట్ పేరుతో అందిస్తున్న నానో డిగ్రీ శిక్షణ 20వారాలు పాటు కొనసాగుతుంది. దీని ద్వారా 2018 నాటికి సుమారు 500మందికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ఇంజనీరింగ్ టెక్నాలజీస్‌పై అత్యాధునిక తర్ఫీదు నివ్వనుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అటానమస్ టెక్నాలజీస్లోతమ ఉద్యోగుల నైపుణ్యాల పునరుద్ధరణకు తాము కట్టుబడి ఉన్నామని ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్, డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవి కుమార్ తెలిపారు. ఉడాసిటీతో భాగస్వామ్యం తమకు గర్వకారణమనీ.. తద్వారా నూతన ఆవిష్కరణలోల తాము ముందంజలో ఉన్నామనే నమ్మకాన్ని తమ ఖాతాదారులకు అందించనున్నట్టు ఆయన చెప్పారు. -
ఊహను నిజం చేసిన మెర్సిడెస్
ఒక్కసారి ఊహించుకోండి. మీ ఆఫీసు అయిపోయింది. ఇంటికి వెళ్లడానికి బయటకు వచ్చారు. కారు దగ్గరకు రాగానే డోర్ దానంతట అదే తెరుచుకుంది. మీరు ఎక్కి కూర్చునేందుకు వీలుగా సీటు.. డోర్ వైపు తిరిగింది. మీరు అందులో కూర్చున్న తర్వాత అది యథాస్థానానికి మారింది. డోర్ లాక్ అయింది. ఎక్కడకు వెళ్లాలో ఆదేశాలిచ్చి.. హాయిగా కళ్లు మూసుకుని రిలాక్స్ అయ్యారు. అంతే.. కారు దానంతట అదే మిమ్మల్ని సురక్షితంగా ఇంటికి చేర్చింది! అలాంటి కారు ఉంటే బావుంటుంది కదూ? ఈ ఊహను జర్మనీ కంపెనీ మెర్సిడెస్ నిజం చేసింది. స్వీయ చోదక.. అదేనండీ.. సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఆవిష్కరించింది. వాస్తవానికి గూగుల్ గతేడాదే సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేసినప్పటికీ, చూడటానికి బొమ్మకారులా ఉండటంతో అది ఎవరినీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ మెర్సిడెస్ తాజాగా లాస్వేగాస్లో ప్రదర్శించిన ఎఫ్015 అనే ఈ కారు సందర్శకుల మతి పోగొట్టింది. ఈ కారును, అందులోని ప్రత్యేకతలను చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. 17 అడుగుల పొడవు, ఐదు అడుగుల ఎత్తు ఉన్న ఈ వాహనం.. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 1100 కిలోమీటర్లు దూసుకుపోతుంది. ఇక దీని విండోలకు ఆరు టచ్ స్క్రీన్ ప్యానెల్స్ ఉన్నాయి. వాటి ద్వారా కారును కంట్రోల్ చేయడంతోపాటు బయటి దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు. టచ్‌తోనే కాకుండా కంటిచూపుతోనూ వాటిని ఆపరేట్ చేయొచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌తోపాటు మనం సొంతంగా కూడా దీనిని నడిపే వెసులుబాటు ఉంది. ఇన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ కారును ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తారో, ధర ఎంతో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.