కారు ఒకరిది.. డాబు వాళ్లది | Sakshi
Sakshi News home page

కారు ఒకరిది.. డాబు వాళ్లది

Published Thu, Jul 20 2023 2:17 AM

Self driving cars are rented and then pledged - Sakshi

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): సెల్ఫ్‌ డ్రైవింగ్‌ పేరుతో కార్లను అద్దెకు తీసుకోని తాకట్టు పెడుతున్న ఇద్దరు ఘరానా నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌ కు తరలించారు. వారి నుంచి రూ. 2.50 కోట్ల విలువ చేసే 15 కార్లను స్వాదీనం చేసుకున్నారు. ఆయా వివరాలను మల్కాజ్‌గిరి డీసీపీ  జానకి బుధవారం విలేకరుల సమావేశం లో వెల్లడించారు.  

ఖమ్మం జిల్లా తాళ్లగూడెం గ్రామానికి చెందిన బొల్లు రాజేష్‌ హైదరాబాద్‌కు వలస వచ్చి  , ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ లో ఉంటూ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గా పని చేస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చిన్న పలుగుతండాకు చెందిన బానోతు నరేందర్‌ అలియాస్‌ నాగేంద్ర ఘాట్‌ కేసర్‌ లోని కొర్రెముల గ్రామంలో నివాసం ఉంటున్నాడు. వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన ఇరువురూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. 

ఈక్రమంలో పథకం ప్రకారం రాజేష్‌ తానొక బ్యాంకు వెండర్‌ అని ప్రచారం చేసుకుంటూ.. కార్లను అద్దెకు తీసుకుంటానని అమాయకులను నమ్మించేవాడు. నెలకు రూ.60 వేలు అద్దె చెల్లిస్తానని చెప్పి యజమానుల నుంచి కార్లు అద్దెకు తీసుకునేవాడు. ఆ తర్వాత కారు యజమానులతో కమ్యూనికేషన్‌ కట్‌ చేసేవాడు. ఓనర్లు వాహనాలను ట్రాకింగ్‌ చేయకుండా కార్లలోని జీపీఎస్‌ వ్యవస్థను ధ్వంసం చేసేవారు. ఆపై వారి కంట పడకుండా తప్పించుకొని తిరిగేవారు.  

ఈ కార్లను తెలిసిన వాహన డీలర్లు, వర్తకుల వద్దకు తీసుకెళ్లి, సొమ్ము అత్యవసరం ఉందని చెప్పి వారిని నమ్మించేవారు. కారుతో పాటు ప్రామిసరీ నోటు, చెక్‌లను తనఖాగా పెట్టి వారి నుంచి సొమ్ము తీసుకునేవారు. ఇలా ఇప్పటివరకు ఇరువురు నిందితులు 13 మంది అమాయకులను మోసం చేసి, 15 వాహనాలను తనఖా పెట్టి, రూ.30 లక్షలు సొమ్ము చేసుకున్నారు. ఉప్పల్‌ పీఎస్‌ పరిధిలో 6 కార్లు, మేడిపల్లిలో 2, చైతన్యపురిలో 2, ఖైరతాబాద్‌ పీఎస్‌ పరిధిలో 5 కార్లు తాకట్టు పెట్టిన కేసులు నమోదయ్యాయి. దీంతో ఉప్పల్‌ పోలీసులు నిందితులు రాజేశ్, నరేందర్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి 9 ఇన్నోవాలు, 2 స్విట్‌ డిజైర్లు, 2 టొయోటో ఎటియోస్, ఒకటి ఇన్నోవా క్రిస్టా, ఒకటి బాలెనో కార్లను స్వాదీనం చేసుకున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement