హైదరాబాద్‌లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్రబింధువుగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు ఆ సంస్థ కొనసాగించనుంది. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియా ద్వారా పంచుకున్నారు.
సినిమాలపై తనకు కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా అన్నారు. 'నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయి. బాహుబలి,కల్కి,ఆర్‌ఆర్‌ఆర్ ,అరుంధతి వంటి అత్యనున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయి. చెన్నైలో ఉన్న సినిమాను ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. ఇప్పుడు కాలంతో పాటు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే . మా దృష్టి హాలివుడ్‌పైనే అని నేను గతంలోనే చెప్పాను. నెట్‌ఫ్లిక్స్‌తో నా కల నిజం కాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు మా పూర్తి సహకారం ఉంటుంది ..
ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నాం ..
నెట్‌ఫ్లిక్స్ వ్యాపార విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణలో పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారానికి అనుకూలత ప్రదేశమని సీఎం అన్నారు.


