హైదరాబాద్: పక్కా పథకం ప్రకారమే మధురానగర్‌లో వారాహి కన్సల్టెన్సీ నిర్వాహకుడు శశికిరణ్‌రెడ్డిని పొలమరశెట్టి ప్రభుకుమార్(19) హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా సాంకేతికతను వినియోగించి చేధించి పట్టుకున్నారు. వివరాలివీ... విశాఖపట్నం జిల్లా మునగపాక మండలం ఘనపర్తి గ్రామానికి చెందిన పొలమరశెట్టి ప్రభుకుమార్(19) టెన్త్ ఫెయిలయ్యాడు.
ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి మధురానగర్‌లో ఉన్న వారాహి కన్సల్టెన్సీ నిర్వాహకుడు శశికిరణ్‌రెడ్డిని సంప్రదించాడు. ఇందుకోసం ఫీజు కింద రూ. 2,500 చెల్లించాడు. హైదరాబాద్‌లోని ఉమర్‌గూడలో అద్దెకు ఉంటున్నాడు. లక్డీకాపూల్‌లోని హిల్‌టాప్ హోటల్‌లో ప్రభుకుమార్‌కు సెక్యూరిటీగార్డ్ ఉద్యోగాన్ని కన్సల్టెన్సీ ద్వారా ఇప్పించాడు. అక్కడ 10 రోజులు పనిచేసిన ప్రభు నిర్వాహకులతో గొడవ పడి ఉద్యోగం మానేయడంతో పనిచేసిన రోజులకు హోటల్ యాజమాన్యం జీతం చెల్లించింది.
అయితే తనకు సరైన ఉద్యోగం ఇప్పించలేదని ప్రభుకుమార్ కొద్ది రోజులుగా శశికిరణ్‌రెడ్డి చుట్టూ తిరుగుతూ తాను చెల్లించిన రూ. 2,500 వాపసు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేయసాగాడు. దీంతో రూ. 1500 ప్రభుకు ఇచ్చి పంపించారు. ఇంకా రూ. 1000 బాకీ ఉన్నాడని, అవి కూడా ఇవ్వాలంటూ రోజూ కన్సల్టెన్సీ చుట్టూ తిరుగుతున్నా స్పందన లేకపోవడంతో శశికరణ్‌రెడ్డి అంతుచూడాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే మంగళవారం మధ్యాహ్నం శశికిరణ్‌ను హత్య చేసేందుకు మధురానగర్‌కు వచ్చాడు.
ప్రాణభయంతో పరుగులు తీసిన ఉద్యోగులు
మంగళవారం మధ్యాహ్నం మధురానగర్‌లోని ఓ మద్యం దుకాణంలో ఫూటుగా మద్యం తాగాడు. అక్కడే ఓ కూరగాయల కత్తిని కొనుగోలు చేసి జేబులో పెట్టుకుని నేరుగా శశికిరణ్ ఆఫీసులోకి ప్రవేశించి గడియ వేసి బెదిరించి తన స్నేహితుడికి రూ. 1500 ఫోన్‌పే చేయించాడు. ఆ తరువాత రూ. 1000 ఇవ్వాలంటూ కత్తితో పొడిచాడు. తలుపు తీసి బయటకు వచ్చే సమయంలో అక్కడే పనిచేస్తున్న ట్రైనర్ లయ కనిపించడంతో ఆమెపై కూడా కత్తితో దాడి చేయడంతో భయంతో ఆమె రెండో అంతస్తులోకి పరుగులు తీసి తలుపులు వేసుకుని ప్రాణాలు కాపాడుకుంది. మిగతా ఉద్యోగులు కూడా భయంతో గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.
అక్కడే రక్తం శుభ్రం చేసుకుని...
నిందితుడు ప్రభు హత్య చేసిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో భవనం కింది భాగంలో ఉన్న రక్తపు మరకలను నీటితో శుభ్రం చేసుకుని కత్తిని అక్కడే వదిలేసి అమీర్‌పేట వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఒక ఆటోను బుక్ చేసుకుని ఎల్‌బీనగర్ వెళ్లాడు. శశికిరణ్‌ను కత్తితో పొడిచిన సమయంలో పెనుగులాటలో ప్రభుకుమార్‌కు కూడా చేతి వేళ్లకు గాయాలు కావడంతో ఎల్‌బీనగర్‌లోని రెయిన్‌బో పిల్లల ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లాడు. తాము ఇక్కడ చికిత్స చేయించలేమని నిరాకరించారు. బయటకు వచి్చన నిందితుడు ఓ కారును బుక్ చేసుకుని విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. చిట్యాల వద్దకు రాగానే నిందితుడి నుంచి రక్తపు వాసన వస్తుండటంతో గమనించిన కారు డ్రైవర్ అతన్ని అక్కడే వదిలేసి తిరుగుముఖం పట్టాడు.
చిట్యాలలో బస్సు ఎక్కిన నిందితుడు తొలుత జగ్గయ్యపేటలోని తన స్నేహితుడి వద్దకు వెళ్లగా, అప్పటికే విషయం తెలుసుకున్న స్నేహితుడు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో విజయవాడకు వెళ్లి కనకదుర్గా టెంపుల్ సమీపంలో తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నాడు. ఫోన్ నెంబర్ సహాయంతో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ట్రాక్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో నిందితుడు తలదాచుకున్న ప్రాంతాన్ని బుధవారం తెల్లవారుజామున గుర్తించారు. అక్కడి నుంచి నిందితుడిని మధురానగర్ ఠాణాకు తరలించారు. ఘటనా స్థలంలో కత్తిని స్వా«దీనం చేసుకున్నారు. రూ. 1000 కోసమే శశికిరణ్‌ను హత్య చేసినట్లుగా నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. మొత్తానికి ఈ కేసును పోలీసులు చేధించారు. గాయాలపాలైన లయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.


