జిల్లా కేంద్రాల చుట్టూ రింగురోడ్లు : సీఎం రేవంత్‌ | Ring roads around district centers | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రాల చుట్టూ రింగురోడ్లు : సీఎం రేవంత్‌

Mar 12 2026 3:58 AM | Updated on Mar 12 2026 3:58 AM

Ring roads around district centers

ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం

పట్టణాల నుంచి రింగురోడ్లకు అనుసంధానంగారేడియల్‌ రోడ్లు.. విజయవాడ రహదారితోనాగార్జునసాగర్‌ అనుసంధానం 

ప్రభుత్వ వాహనాలుగా ఈవీలే ఉండాలన్న సీఎం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటికీ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్లు భవనాల శాఖను ఆదేశించారు. జిల్లా కేంద్రాలైన ప్రధాన పట్టణాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా చూడటంతో పాటు సరుకు రవాణా వాహనాలు వేగంగా ముందుకు సాగేందుకు రింగురోడ్లు దోహదం చేస్తాయని అన్నారు. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రోడ్లు భవనాల శాఖ, రవాణా శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. 

అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాల చుట్టూ ఉన్న రోడ్లను అనుసంధానించి రింగురోడ్లుగా మార్చాలని, ఆయా పట్టణాల నుంచి రింగురోడ్లకు అనుసంధానంగా రేడియల్‌ రోడ్లను నిర్మించాలని సీఎం ఆదేశించారు. సమీపంలోని జాతీయ రహదారులకు రింగురోడ్లను అనుసంధానించే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. 

హైదరాబాద్‌–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ వే నుంచి నాగార్జునసాగర్‌ చేరేందుకు కొత్తగా రోడ్డు నిర్మించే అంశంపై కూడా అధ్యయనం చేసి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలను వేగంగా పూర్తి చేసి, అవసరమైన కొత్త వాటి కోసం ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు.   

ఈవీల వినియోగం పెంచాలి.. 
వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక నుంచి ప్రభుత్వ వినియోగం కోసం కొనే వాహనాలన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాలే అయి ఉండాలని స్పష్టం చేశారు. ‘క్యూర్‌’ పరిధిలో అద్దెకు తీసుకునే ప్రభుత్వ వాహనాలు కూడా అవే ఉండాలని చెప్పారు. రవాణా శాఖలో ఇక అన్ని సేవలు ఆన్‌లైన్‌ ద్వారానే సాగాలని ఆదేశించారు. కార్యాలయాలన్నీ సొంత భవనాల్లోనే ఉండాలని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.  

శంషాబాద్‌ సమీపంలో ఆధునిక బస్‌ టెర్మినల్‌ 
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు లఘు చిత్రాలు ప్రదర్శించాలని సీఎం సూచించారు. శంషాబాద్‌ సమీపంలో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ప్రారంభమయ్యే ప్రాంతంలో ఆధునిక బస్‌ టెర్మినల్‌ నిర్మించాలని, ఇందుకు స్థలం కేటాయిస్తామని, అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్ది, రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ మోహన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement