హైద‌రాబాద్‌ పిల్ల‌ల సోషల్‌ మీడియా వినియోగం ఎంతంటే? | Rising social media use in Hyderabad: NGO Survey | Sakshi
Sakshi News home page

హైద‌రాబాద్‌లో మితిమీరిన సోష‌ల్ మీడియా వినియోగం

Mar 11 2026 10:45 PM | Updated on Mar 11 2026 10:45 PM

Rising social media use in Hyderabad: NGO Survey

వాడకంలో టాప్‌ నగరాలలో ఒకటిగా చేరిన వైనం

చిన్నారులు, యువత ఖాతాల సంఖ్యే అత్యధికం

రీల్స్‌ కోసం పెరుగుతున్న తల్లిదండ్రుల ప్రోత్సాహం

జెన్‌–జీ కన్నా జెన్‌– ఆల్ఫాపై తీవ్రస్థాయిలో ప్రభావం

భవిష్యత్తు పరిణామాలపై హెచ్చరిస్తున్న నిపుణులు 

కర్ణాటకలో 16 ఏళ్ల లోపు వారికి సోషల్‌మీడియా నిషేధం? 

పొద్దున లేవగానే ఒకసారి.. స్కూల్‌కి వెళ్లే ముందు  మరోసారి.. మళ్లీ తిరిగొచి్చనప్పటి నుంచి సరదాగా కాలక్షేపానికి.. నిద్రపోయే ముందు కొద్దిసేపు.. ఇదేదో మందులు వేసుకోడానికి  ప్రి్రస్కిప్షన్‌పై రాసిన సమయం అనుకునేరు? అలా అనుకుంటే పొరపాటే.. ఇది ప్రస్తుతం నగరాల నుంచి పల్లెల వరకూ సామాజిక మాధ్యమాల వినియోగంలో పిల్లలు బంధీలైన తీరు. కొందరు టైం పాస్‌ కోసం.. మరికొందరు సెలబ్రిటీ స్టేటస్‌ కోసం.. పిల్లలు  మొదలుకుని.. పండు ముసలి వరకూ ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ వంటి ఖాతాల వినియోగం పెరిగిపోయింది. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో అయితే చెప్పే ప్రసక్తే లేదు.. దైనందిన జీవితంలో కనీసం రెండు గంటల పాటు దీనికోసమే కేటాయిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16ఏళ్ల లోపువారికి సోషల్‌ మీడియా వినియోగాన్ని నిషేధిస్తామని ప్రకటించడంతో దేశవ్యాప్త చర్చకు దారితీసింది.    – సాక్షి, సిటీబ్యూరో

హైదరాబాద్‌లో సోషల్‌ మీడియా వాడకం సర్వసాధారణ విషయం. ఈ సోషల్‌ యాప్స్‌ వాడకం వయసుతో సంబంధం లేకుండా మారింది. బాల్యం అంటే అటలు.. పాటలు అనే కాలం నుంచి.. బాల్యం అంటే స్మార్ట్‌ఫోన్‌ అనే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. అయితే.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదా.? అమలు సాధ్యమా? ముఖ్యంగా సోషల్‌ మీడియా వినియోగం అధికంగా ఉండే హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో చిన్నారులు, టీనేజర్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

డిజిటల్‌ ‘డీలా’.. 
ఓ వైపు చాట్‌ జీపీటీ, ఏఐ, జెమినీ, పర్‌ప్లెక్సిటీ వంటి టెక్నాలజీ వేదికలతో అంతా స్మార్ట్‌ మయం అవుతోంది. విద్యా కేంద్రాల్లో, పాఠశాలల్లో టెక్నాలజీ వినియోగం, స్మార్ట్‌ ఆలోచనలవైపు ప్రపంచం పరుగుపెడుతోంది.. అదే టెక్నాలజీ వినియోగంలో నైపుణ్యం సాధించేందుకు చిన్నారులకు స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌ పరిచయం చేస్తూ.. ఆన్‌లైన్‌ క్లాసులు, హోమ్‌వర్క్‌ పేరుతో క్రమంగా స్క్రీన్‌ టైమ్‌ సోషల్‌ మీడియావైపు దారి మళ్లుతోంది.

ఎంతలా అంటే.. టెక్నాలజీ పరిచయం లేని పాఠశాలల్లోని పిల్లలు సైతం సోషల్‌ మీడియా ఖాతాలు వినియోగించేలా. రీల్స్, షార్ట్స్, గేమింగ్, లైవ్‌ స్ట్రీమ్‌.. వంటి వ్యాపకాలతో అనేక సామాజిక రుగ్మతలకు లోనవుతున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రత్యక్షంగా మాట్లాడే నైపుణ్యాలు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం వంటివి తగ్గిపోయి.. వర్చువల్‌ ఫ్రెండ్‌షిప్, లైక్స్, ఫాలోవర్స్‌ ఆధారంగా రిలేషన్స్‌ని అంచనావేసే మానసిక ధోరణికి లోనవుతున్నారు. ఫలితంగా ఆందోళన, అసూయ, డిప్రెషన్‌ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.  

పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. 
సోషల్‌ మీడియా అధిక వినియోగం వల్ల నైపుణ్యాలను కోల్పోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. మరీ ముఖ్యంగా స్క్రీన్‌ టైమ్‌ పెరగడం వల్ల కంటి సమస్యలు, దృష్టిలోపం, తలనొప్పి, నిద్రలేమితనం, స్థూలకాయం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. దీంతోపాటు శారీరక చురుకుదనం తగ్గి జీవనశైలి వ్యాధులకు లోనవుతున్నారు. మరోవైపు ఫాలోవర్స్, లైక్స్‌ సంఖ్య ఆధారంగా స్వీయ విలువను అంచనావేసే మానసిక రుగ్మతకు, ట్రోలింగ్, సైబర్‌ బుల్లీయింగ్‌తో తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని, దీనిపై కట్టడి లేకపోతే భవిష్యత్తులో దుష్పరిణామాలను చూడాల్సిన పరిస్థితి తప్పదని మానసిక నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

ఈ అడిక్షన్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంటి సభ్యులే కారకులవుతున్నారు. పిల్లలకు అన్నం తినిపించడానికి, ఏడవకుండా ఉండడానికి మొదలై.. బిజీ జీవితంలో పిల్లలకు సమయం కేటాయించలేక వారిని అల్లరిని కట్టడిచేయడానికి స్మార్ట్‌ఫోన్‌ అలవాటు చేస్తున్నాం. దీంతోపాటు చౌకైన డేటా అనో, అందరూ వాడుతున్నారులే..అనే భావన, కంటెంట్‌ అల్గారిథమ్స్‌ పిల్లలను ఎక్కవగా ఆకట్టుకునేలా రూపొందించిన ప్రోగ్రామ్స్‌ కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని కట్టడిచేయడంలో మొదటి పాత్ర తల్లిదండ్రులదే.. మితిమీరిన వినియోగం వల్ల పిల్లల గోప్యత, భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, బైక్‌ నెంబర్లను ఆధారంగా చేసుకుని ఓ చిన్నారిని కిడ్నాప్‌ చేసిన ఘటన ఆ మధ్య చర్చనీయాంశమైంది. పిల్లల జీవితాలను కంటెంట్‌గా మార్చడం ఎంతవరకూ సమంజసం? అనేచర్చ ఉత్పన్నమవుతోంది.

సర్వే చెబుతోందేంటి? 
హైదరాబాద్‌లో ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. 10–16 ఏళ్ల వయసు పిల్లల్లో సుమారు 68 శాతం మంది రోజుకు కనీసం 2–3 గంటలు సోషల్‌ మీడియా వినియోగిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది నిద్ర సమస్య, 30 శాతం మంది చదువుపై దృష్టి తగ్గడం, వయసుకు మించిన సమాచారం తెలుసుకోవడం, సామాజిక, నైతిక పరమైన విషయాల్లో జెన్‌ జీ తరం కన్నా.. జెన్‌ ఆల్ఫా తరంలో తేడాలు కనిపిస్తున్నాయని సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. అయితే సంపూర్ణ నిషేధం కంటే.. అవగాహన, నియంత్రణ, తల్లిదండ్రుల భాగస్వామ్యం ముఖ్యమని.. డిజిటల్‌ లిటరసీ, హెల్దీ స్క్రీన్‌ హ్యాబిట్స్‌ నేర్పడం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెంచడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

కట్టడి సాధ్యమేనా? 
దేశంలో చిన్నారుల ఆన్‌లైన్‌ భద్రతకు ఐటీ నిబంధనలు, డేటా రక్షణ మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ వంటి నగరాల్లో అమలే పెద్ద సవాలుతో కూడినది. వయసు నిర్ధారణ వ్యవస్థలు బలహీనంగా ఉండటం, తల్లిదండ్రులే అకౌంట్లు తెరవడానికి అనుమతించడం వల్ల నిబంధనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు చిన్నారులకు ఎలాంటి కంటెంట్‌ చూపించాలి, వేటికి దూరంగా ఉంచాలి అనే విషయాల పై పెద్దలకు అవగాహన లేకపోవడం. సమయ పరిమితితో విద్యాపరమైన వెబ్‌సైట్లు, ఈ–లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్, కథలు, సైన్స్‌ వీడియోలు, క్రియేటివ్‌ ఆర్ట్స్‌ వంటి కంటెంట్‌ వైపు పిల్లలను మళ్లించడం వారి అభిృద్ధికి దోహదపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement