కాంగ్రెస్ పాలనలో అవమానం: కిషన్‌రెడ్డి | Kishan Reddy Comments Telangana Speaker Decision | Sakshi
Sakshi News home page

ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు క్లీన్‌చిట్‌పై కిష‌న్‌రెడ్డి ఫైర్‌

Mar 11 2026 6:02 PM | Updated on Mar 11 2026 6:23 PM

Kishan Reddy Comments Telangana Speaker Decision

సాక్షి, హైద‌రాబాద్‌: తెలంగాణలో ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పాలనలో అవమానం జ‌రిగింద‌ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. పార్టీ ఫిరాయింపుదారుల వ్య‌వ‌హారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి శాస‌న‌స‌భ‌ స్పీక‌ర్ ప్ర‌సాద్‌కుమార్ క్లీన్‌చిట్ ఇవ్వ‌డంపై ఆయ‌న స్పందించారు. పార్టీ ఫిరాయింపుదారులకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడం హాస్యాస్పదమ‌ని బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీక‌ర్ వ్య‌వ‌హారశైలి ఉంద‌ని విమ‌ర్శించారు.

''దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసుల్లో స్పీకర్ తీరు రాజ్యాంగ విరుద్ధం. బీఆర్ఎస్ – కాంగ్రెస్ ఒకే తీరుతో వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌పై వేటు వేయకపోవడం అప్రజాస్వామికం. ఫిరాయింపులను అరికట్టాల్సిన స్పీకర్.. క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఫిరాయింపులను ప్రోత్సహించినట్టే. ప్రజా తీర్పును కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాలరాస్తున్నాయి. అధికారంతో వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చు కానీ ప్రజల ఆగ్రహాన్ని కాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తార''ని కిష‌న్‌రెడ్డి హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రానికి మచ్చ: డాక్టర్ లక్ష్మణ్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, చీకటి రోజని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమ‌ర్శించారు. స్పీకర్ ఇచ్చిన తీర్పు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందని మండిప‌డ్డారు. శాసన సభ స్పీకర్ వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా వ్యవహరించారని దుయ్య‌బ‌ట్టారు. ఎమ్మెల్యేల క్లీన్‌చిట్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి మచ్చ అని వ్యాఖ్యానించారు. 

''పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కిందికిరారు అంటున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు నిర్వహాచనం ఏంటి? ఒకరు ఎంపీగా పోటీ చేశారు, ఇంకొకరు ఎన్నికల్లో ప్రచారం చేశారు. గతంలో నైతిక విలువలతో అటల్ బీహార్ వాజపేయి రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో గెలిచారు. గతంలో బీఆర్‌ఎస్‌ హోల్‌సేల్‌గా ఎమ్మెల్యేల‌ను చేర్చుకుంటే,  రిటైల్‌గా కాంగ్రెస్ వ్యవహరించింది. రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విధానంపై జవాబు చెప్పాలి. దేశం మొత్తం తలవంపులు తెచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఉంద‌''ని డాక్టర్ లక్ష్మణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

చ‌ద‌వండి: లావు శ్రీకృష్ణ దేవరాయలకు కేటీఆర్ కౌంటర్

Advertisement
 
Advertisement
Advertisement