లావు శ్రీకృష్ణ దేవరాయలకు కేటీఆర్ కౌంటర్ | KTR gives counter to Lavu Sri Krishna Devarayalu | Sakshi
Sakshi News home page

లావు శ్రీకృష్ణ దేవరాయలకు కేటీఆర్ కౌంటర్

Mar 11 2026 5:31 PM | Updated on Mar 11 2026 6:09 PM

KTR gives counter to Lavu Sri Krishna Devarayalu

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి 13 ఏళ్లు అయిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ, ఆంధ్ర బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ‘మా తమ్ముడు కృష్ణ దేవరాయలు మంచిగా మాట్లాడాలని కోరుతున్నా. తెలంగాణపై ఏడుపు బంద్ చేయాలి’ అని అన్నారు. కాగా, లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 2014 ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా అనడంతో తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.

శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారు?
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘దేశ చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ ఫిరాయింపులను స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. 2004లో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎత్తుకుపోయింది. కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్సీని చేశారు కేసీఆర్. ఆయన బిడ్డకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారు? కడియం శ్రీహరి బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా? 

స్పీకర్ కార్యాలయం ఆర్డర్ కాపీ ఇవ్వడానికి భయపడుతోంది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ అద్భుతంగా పని చేసి ఉంటే ఎన్నికలకు వెళ్లడానికి ఎందుకు భయం? రాహుల్ గాంధీ ఎలా చెప్తే అలా స్పీకర్ నడుస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంచివారే, ఆయనపై మాకు గౌరవం ఉంది. రాహుల్ గాంధీకి పార్టీ ఫిరాయింపులపై స్పందించాలి. కడియం శ్రీహరి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుతున్నారు’ అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement