దోహా: పశ్చిమాసియాలో రోజురోజుకు ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాంతంలోని దేశాలేవీ ఇరాన్‌కు శత్రువులు కావని, పరస్పర దాడుల వల్ల ఏ పక్షానికీ ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ తక్షణమే శత్రుత్వాన్ని వీడి, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.
గత రెండు వారాలుగా అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న తీవ్రస్థాయి బాంబు దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ ప్రాంతంలోని తన పొరుగు దేశాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడులతో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ఇంధన సరఫరా వ్యవస్థ ఈ ఉద్రిక్తతల వల్ల అతలాకుతలమవుతోంది. పౌర నివాసాలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఖతార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అల్ జజీరాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఖతార్ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-ఖులైఫీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిణామాలు అత్యంత దురదృష్టకరమని , ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కేవలం చర్చలతోనే సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్నామని ఆయన పేర్కొన్నారు. ఖతార్ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. తమ దేశ ప్రయోజనాలను, ప్రాంతీయ భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమపై దాడులు జరుగుతున్నప్పుడు మధ్యవర్తిత్వం వహించడం అసాధ్యమని ఇరాన్ గుర్తించాలని ఆయన సూచించారు.
ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనికి తక్షణ పరిష్కారం అవసరమని బిన్ అబ్దుల్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ దేశాలు ఇరాన్‌కు వ్యతిరేకం కాదన్న విషయాన్ని టెహ్రాన్ అర్థం చేసుకోవడం లేదని అన్నారు. ఇప్పటికే ఖతార్ ప్రధాని మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీ ఇరాన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, పొరుగు దేశాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో కూడా ఖతార్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. యుద్ధ వాతావరణాన్ని వీడి, శాంతి మార్గంలో పయనించాలని ఇరు పక్షాలకు ఖతార్ విజ్ఞప్తి చేస్తోంది.
ఇది కూడా చదవండి: Switzerland: బస్సులో మంటలు.. ఆరుగురు సజీవ దహనం


