ఇంధన రంగంలో ట్రంప్‌ సంచలనం | Donald Trump Announces Opening Of Oil Refinery In Texas | Sakshi
Sakshi News home page

ఇంధన రంగంలో ట్రంప్‌ సంచలనం

Mar 11 2026 7:17 AM | Updated on Mar 11 2026 7:33 AM

Donald Trump Announces Opening Of Oil Refinery In Texas

వాషింగ్టన్‌: అమెరికా ఇంధన రంగ చరిత్రలో సరికొత్త సంచలనం నమోదయ్యింది. గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా నూతన చమురు శుద్ధి కర్మాగారాన్ని (ఆయిల్‌ రిఫైనరీ) టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లే పోర్ట్ వద్ద ప్రారంభించినట్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాదాపు 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 25 లక్షల కోట్లు) భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భారత దిగ్గజ సంస్థ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ కీలక భాగస్వామిగా ఉండటం విశేషం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ఇంధన స్వావలంబన దిశగా అమెరికా వేసిన ఈ అడుగు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

చారిత్రక ఒప్పందం
ఈ చారిత్రక ఘట్టాన్ని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు. ‘అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ పేరిట గత 50 ఏళ్లలో తొలిసారిగా సరికొత్త రిఫైనరీని ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం. మా భాగస్వామి అయిన భారతీయ ప్రైవేట్ ఇంధన రంగ దిగ్గజం రిలయన్స్ సంస్థకు, వారి భారీ పెట్టుబడులకు ప్రత్యేక కృతజ్ఞతలు  చెబుతున్నాను’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో అమెరికాలోని వేలాది కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఊతమిస్తుందని అని ట్రంప్‌ వివరించారు.

పర్యావరణ హితం
ఈ రిఫైనరీ కేవలం ఇంధన ఉత్పత్తికే పరిమితం కాకుండా, ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన (Cleanest) రిఫైనరీగా గుర్తింపు పొందుతుందని ట్రంప్ పేర్కొన్నారు. సరళీకృత అనుమతులు, పన్ను తగ్గింపుల వంటి ప్రభుత్వ విధానాల వల్లే ఇటువంటి భారీ పెట్టుబడులు దేశానికి వస్తున్నాయని ఆయన అన్నారు. దీనివల్ల దక్షిణ టెక్సాస్ ప్రాంతం ఆర్థికంగా పటిష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇరాన్ దాడుల కారణంగా గల్ఫ్ దేశాల్లో ఇంధన సరఫరాకు అంతరాయం కలుగుతున్న వేళ, అమెరికా సొంతంగా ఇంధన ఉత్పత్తిని పెంచుకుని, గ్లోబల్ మార్కెట్‌పై తన పట్టును నిలుపుకోవాలని చూస్తోంది.

తగ్గనున్న ఇంధన ధరలు
మరోవైపు పెరుగుతున్న చమురు ధరలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న ధరల పెరుగుదల తాత్కాలికమేనని అన్నారు. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' లక్ష్యాలు పూర్తయిన తర్వాత అమెరికన్లకు తక్కువ ధరలకే ఇంధనం అందుబాటులోకి వస్తుందని ఆమె హామీ ఇచ్చారు. ఇరాన్ నుంచి ఎదురయ్యే అణు ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొంటామని, మిత్రదేశాల ప్రయోజనాలను కాపాడతామని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement