దుబాయ్: ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎమిరేట్ పూర్తిస్థాయిలో సురక్షితంగా ఉందని, అన్ని కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే అత్యవసర హెచ్చరికలు జారీ అయిన సందర్భంలో నివాసితులు, సందర్శకులు ఎలా స్పందించాలనే విషయంపై ముందస్తు జాగ్రత్త సూచనలు ఇచ్చారు.
మొబైల్ ఫోన్లకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి హెచ్చరికలు అందినప్పుడు ప్రజలు ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరించేలా ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిపారు.
మార్గదర్శకాల ప్రకారం.. హెచ్చరిక అందిన సమయంలో బయట ఉన్నవారు భయపడకుండా వెంటనే సమీప భవనంలోకి వెళ్లాలని సూచించారు. వాహనం నడుపుతున్నవారు కూడా సమీపంలోని ఇండోర్ ప్రదేశానికి సురక్షితంగా చేరుకోవాలని, కిటికీలు, బాల్కనీలు లేదా బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే భవనాల బయటి గోడలు, గాజు ప్యానెల్స్ సమీపంలో ఉండకూడదని హెచ్చరించారు.
ప్రజలు అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే నమ్మాలని, ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించిన అప్‌డేట్స్‌నే అనుసరించాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే ధ్రువీకరించని సందేశాలు, వాయిస్ రికార్డింగులు లేదా వీడియోలను షేర్ చేయవద్దని కూడా స్పష్టం చేశారు.
ఇంట్లో ఉన్నవారికి సూచనలు
ఇళ్లలో లేదా కార్యాలయాల్లో అప్పటికే భవనాల లోపల ఉన్నవారు కిటికీలు, బాల్కనీలు, బహిరంగ ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని గైడ్ సూచించింది. అవసరమైతే భవనం లోపల మరింత సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని తెలిపింది.
అదేవిధంగా పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్స్ లేదా భద్రతా సిబ్బంది ఇచ్చే సూచనలను గమనించాలని, ప్రత్యేకంగా సూచించని వరకు ఎలివేటర్ల వినియోగాన్ని నివారించాలని అధికారులు పేర్కొన్నారు. పెద్ద గాజు ఉపరితలాలు లేదా గాజు గోడల సమీపంలో ఉండకూడదని సూచించారు.
పరిస్థితి పూర్తిగా ముగిసిందని అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి “ఆల్ క్లియర్” నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రజలు తమ ప్రస్తుత స్థానంలోనే ఉండాలని దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. అనంతరం సాధారణ కార్యకలాపాలను ప్రశాంతంగా పునఃప్రారంభించవచ్చని పేర్కొంది.


