గతంలో గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ పాస్ఫరస్‌తో దాడి చేసినప్పుడు ఏర్పడిన తెల్లటి మేఘాలు (ఫైల్)
ఆక్సిజన్‌తో చర్య జరిపి భగ్గున మండనున్న వైట్ ఫాస్ఫరస్
యోహ్మోర్ నగరంపై ఇజ్రాయెల్ దుర్వినియోగం
హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వెల్లడి
వైట్ ఫాస్ఫరస్.. ప్రాణవాయువుతో కలిస్తే ప్రాణం తీసేంత స్థాయి ప్రమాదకారిణి. సాగుభూముల్లో పంట మొదలు జనావా సాలు, జనం మధ్య పడితే భగ్గున మండి శాశ్వత వినాశనం చేసే శక్తి ఈ వైట్ ఫాస్ఫ రస్‌కు ఉంది. ఇంతటి ప్రమాదకర రసాయ నాన్ని ఇజ్రాయెల్ వాయుసేన విచ్చల విడిగా లెబనాన్‌పై ప్రయోగిస్తోందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ అనే లాభా పేక్షలేని స్వచ్ఛంద సంస్థ తాజాగా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మార్చి నెల మూడో తేదీన దక్షిణ లెబనాన్‌లోని యోహ్మోర్ నగరంపై ఇజ్రాయెల్ వాయు సేన వైట్ ఫాస్ఫరస్‌తో దట్టించిన మందుగుండును ప్రయోగించి స్థానికుల జీవితాలను గాల్లో దీపంలా మార్చేసింది. వైట్ ఫాస్ఫరస్‌ను ఉపయోగించారంటూ వేర్వేరు ప్రదేశాల్లో తీసిన ఏడు ఫొటోలను సంస్థ సోమవారం బయటపెట్టింది.
గాలి తగలగానే వైట్ ఫాస్ఫరస్ (White Phosphorus) సెకన్ల వ్యవధిలో మండిపోతుంది. సగటు పౌరునికి జరిగే నష్టం గురించి చెప్పక్కట్లేదు. కళ్లు మండిపోతాయి. శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక చిన్నారులు, వృద్దులు, గర్భిణుల అవస్థ చెప్పనక్కర్లేదు. ఫాస్ఫరస్‌ను యుద్ధంలో వినియోగించడం చట్టవిరుద్ధం. ముఖ్యంగా జనావాసాలపై ప్రయోగించడం అత్యంత ప్రమాదకరం. ఇది తగిలితే లోతైన గాయాలు కావడం ఖాయం’’ అని లెబనాన్‌లో హెచ్‌ఆర్‌డబ్ల్యూ సంస్థలో పరిశోధకుడు రామ్జీ కైస్ అన్నారు.
‘‘అన్నీ తెలిసి యుద్దంలో రసాయనాలను వినియోగించడం అనేది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని అవహేళన చేయడమే అవుతుంది. ఇలాంటి రసాయనాల వినియోగంతో జనాలను అప్రమత్తంచేసే ముందస్తు రక్షణాత్మక విధానాల అమలుకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఇజ్రాయెల్ వెంటనే వైట్ ఫాస్ఫరస్ వాడకాన్ని ఆపేయాలని దాని మిత్రదేశాలైన అమెరికా, బ్రిటన్, జర్మనీలను హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ డిమాండ్‌చేసింది.
ఏమిటీ వైట్ ఫాస్ఫరస్?
ఇదొక రసాయన మిశ్రమం. శతఘ్నుల నుంచి దూసుకొచ్చే ఫిరంగి గుళ్లు, విమానాల నుంచి ప్రయోగించే బాంబులు, రాకెట్ల నుంచి వెలువడే పేలుడు పదార్థాల్లో వైట్ ఫాస్ఫరస్‌ను కొన్ని సార్లు దట్టిస్తారు. ఇది గాల్లో ఆక్సిజన్‌తో చర్య జరిపి వెంటనే మండుతుంది. ఇది మనుషులపై పడితే ఒళ్లు కాలిపోతుంది. శాశ్వత గాయాలు జీవితాంతం నరకం చూపిస్తాయి. దాడితోపాటు ఇతర రకాలుగా సైనిక చర్యల్లో దీనిని ఉపయోగిస్తారు. నిర్దేశిత ప్రాంతంలో పొగమేఘాలు ఏర్పడేలా చేయడం, ఒక లక్ష్యాన్ని పొగ ద్వారా గుర్తుపెట్టుకోవడం, ఒకరకమైన సైగలాగా దీనిని ఉపయోగిస్తారు. ఇది పేలుడు పదార్థం నుంచి వెలువడగానే దాదాపు 250 మీటర్ల విస్తీర్ణంలో విశాలంగా పరుచుకుంటుంది. వెంటనే ఆక్సిజన్‌తో చర్య జరిపి సమీప వస్తువులను కాల్చేస్తుంది.
ఎం825 రకం 155ఎంఎం శతఘ్నుల ద్వారా ఈ వైట్ ఫాస్పరస్ గుళ్లను ప్రయోగించారని హ్యూమన్ రైట్ వాచ్ సంస్థ ఫొటోలతో సహా సాక్ష్యాధారాలను బయటపెట్టింది. యోహ్మోర్‌లో స్థానికులు తమ ఫేస్‌బుక్ ఖాతాల్లో పెట్టిన ఫొటోల్లోనూ ఇవే ధూళి మేఘాలు కన్పించడం గమనార్హం. దీనికితోడు కచ్చితంగా ఫలానా ప్రదేశాలను ఖాళీ చేయాలని బీరుట్ దక్షిణ ప్రాంతాల వాసులను తొలుత ఇజ్రాయెల్ హెచ్చరించింది. వీటిల్లో హెజ్‌బొల్లా అధీనంలోని ప్రాంతాలూ ఉన్నాయి. ఈ లెక్కన ఇక్కడ భారీస్థాయిలో దాడి జరగబోతోందని ఇజ్రాయెల్ పరోక్షంగా ప్రకటించింది. ఆ తర్వాతే వైట్ ఫాస్ఫరస్ మేఘాలు గాల్లో కన్పించాయని సంస్థ పేర్కొంది.
మూడేళ్ల క్రితమూ ఇదే ధోరణి
గాజాలోనూ ఇజ్రాయెల్ ఇదే తరహాలో వైట్ ఫాస్ఫరస్‌ను అన్యాయంగా ప్రయోగించి పాలస్తీనియన్లకు నరకం చూపించిందని ఆనాడు కథనాల వెలువడ్డాయి. 2023 అక్టోబర్ 10, 11వ తేదీల్లో గాజాతోపాటు లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్ ఈ రసాయనాన్ని విరివిగా వాడినట్లు వీడియోలను హ్యూమన్ రైట్స్ వాచ్ విడుదలచేసింది. గాజా సిటీ పోర్ట్‌తోపాటు ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి.
చదవండి: తొలిసారిగా బయటపడిన ఇజ్రాయెల్- అమెరికా విబేధాలు
తాజా దాడుల ధాటికి 5,00,000 మంది లెబనాన్‌వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ముఖ్యంగా ఘోబియెరీ, హరేట్ హ్రియిక్, సఫిర్ ప్రాంతాల్లో జనం ప్రాణభయంతో వలస పోతున్నారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్‌లో 394 మంది చనిపోయారు. 1,000 మంది గాయపడ్డారు. 2023 అక్టోబర్, 2024 మే మధ్య సైతం వైట్ ఫాస్ఫరస్‌ను ఇజ్రాయెల్ వినియోగించిందని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వెల్లడించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


