ఇజ్రాయెల్‌పై అమెరికా అసంతృప్తి | Was US Unhappy After Israel Struck 30 Iranian Fuel Depots | Sakshi
Sakshi News home page

తొలిసారిగా బయటపడిన అమెరికా- ఇజ్రాయెల్‌ విబేధాలు

Mar 10 2026 5:15 PM | Updated on Mar 10 2026 5:51 PM

Was US Unhappy After Israel Struck 30 Iranian Fuel Depots

వాషింగ్టన్‌: ఇరాన్‌పై ఉమ్మడిగా సమరశంఖం పూరించిన అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య అభిప్రాయబేధాలు పొడచూపాయి. ఇరాన్‌కు చెందిన వైమానిక స్థావరాలను పేల్చేస్తూ, యుద్ధనౌకలను ముంచేస్తూ దేశ సైనికశక్తిని అమెరికా నిర్వీర్యంచేస్తుంటే ఇజ్రాయెల్‌ పనికట్టుకుని ఇరాన్‌ చమురునిల్వలపై బాంబులేసి అగ్నికి ఆహుతిచేస్తోంది. ఆయిల్‌ జోలికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇజ్రాయెల్‌పై అమెరికా అంతెత్తున లేచి ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏ రకంగా చూసినా చమురు క్షేత్రాలపై దాడి అనేది ఏమాత్రం మంచి ఆలోచన కాదని అమెరికా అభిప్రాయపడింది. ఈ మేరకు బూతు ధ్వనించేలా ‘డబ్ల్యూటీఎఫ్‌’ అంటూ ఒక మాటను సందేశంగా పంపించింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడి మొదలెట్టాక ఇజ్రాయెల్, అమెరికా బహిరంగంగా అభిప్రాయబేధాలను వ్యక్తపరచడం ఇదే తొలిసారి.

శనివారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని పలు చమురు మౌలికసదుపాయాలపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల ధాటికి ఆయిల్‌ కేంద్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. దట్టంగా కిలోమీటర్ల పరిధిలో నల్లటి పొగ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో అమెరికా ఆగ్రహం వ్యక్తంచేసింది. అయితే ఆయిల్‌ డిపోలపై తమ దాడులను ఇజ్రాయెల్‌ సమర్థించుకుంది. తమ జనావాసాలపై ఇరాన్‌ చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే ఆయిల్‌ డిపోలను లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోరెస్సెస్‌ (ఐడీఎఫ్‌) పేర్కొంది. ఈ చమురు డిపోల నుంచి ఇరాన్‌ సైనికబలగాలకు ఇంధనం సరఫరా అవుతోందని వెల్లడించింది.

అయితే దైనందిన జీవితంలో భాగమైన ఇంధన అవసరాలు తీర్చే చమురు డిపోలపై దాడి చేసి అనవసరంగా అంతర్జాతీయ చమురుధరల పెరుగుదలకు ఇజ్రాయెల్‌ ఆజ్యంపోస్తోందని అమెరికా ఆగ్రహం వ్యక్తంచేసింది. దాడికి గురైనవి చమురు ఉత్పత్తి కేంద్రాలు కావు. కానీ సాధారణ వినియోగదారుల అవసరాలు తీర్చే చమురు డిపోలు తగలబడితే జనాల్లో ఆగ్రహావేశాలు పెరిగి మళ్లీ పరోక్షంగా ఇరాన్‌ ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతు పెరుగుతుందని అమెరికా భావిస్తోంది. ఇది జరక్కుండా ఉండాలంటే పౌరులకు ఇబ్బందుల్లోకి నెట్టేసే పనులు చేయొద్దని అమెరికా నిర్ణయించుకుంది. అందుకే ఇజ్రాయెల్‌కు సైతం ఇవే సూచనలు చేసినా వాటిని బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్‌ ఇష్టారీతిన దాడులు చేస్తోందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

‘‘దాడుల విషయాన్ని ఇజ్రాయెల్‌ మాకు ముందే తెలియజేసింది. కానీ ఇంతటి విపరీతమైన స్థాయిలో దాడులు చేయబోతున్నట్లు మాట మాత్రమైనా చెప్పలేదు’’అని ఉన్నతాధికారి ఒకరు అసహనం వ్యక్తంచేశారు. ‘‘ఇంతటి దాడులను మా అధ్యక్షుడు ట్రంప్‌ అస్సలు అంగీకరించడు. చమురును భద్రపర్చుకోవడమే ఆయనకు కావాలి. ఇలా తగలబడితే ఏమొస్తుంది?. అసలు చమురు నిల్వలపై దాడులెందుకు?. ఇది చివరకు ధరల పెరుగుదలకు కారణమవుతుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వివరాలతో యాక్సియస్‌ వార్తాసంస్థ వెలువర్చిన కథనంపై ఇటు వైట్‌హౌస్‌ అటు ఐడీఎఫ్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  

చమురు జోలికొస్తే ఊరుకోం: ఇరాన్‌ 
చమురును మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే ఊరుకునేది లేదని ఇరాన్‌ మిలటరీ వ్యవహారాలు చూసుకునే ఖాటమ్‌ అల్‌–అన్బియా ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి హెచ్చరించారు. ‘‘పశ్చిమాసియాలోని ఇతర దేశాలపై దాడులు చేయొద్దని భావిస్తున్నాం. మా చమురు డిపోలపై దాడులు కొనసాగితే మా నిర్ణయాన్ని పునర్‌పరిశీలించాల్సి ఉంటుంది. పొరుగుదేశాల చమురుడిపోలపై మేం గనక దాడులు చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడి చమురు ధర 200 డాలర్ల(దాదాపు రూ.18,461)కు పెరగడం ఖాయం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

చ‌ద‌వండి: ఈ క్షిప‌ణుల‌ను ఇరాన్ ధ‌నాధ‌నా వేసింద‌నుకో..

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దెబ్బకు గత మూడున్నరేళ్లలో ఎన్నడూలేనంతగా సోమవారం బ్యారెల్‌ క్రూడ్‌ ధర 100 డాలర్లకు చేరడం తెల్సిందే. హార్మూజ్‌ జలసంధి గుండా చమురునౌకల రాకపోకలు స్తంభించిపోవడం ధరల ఉరవడికి మరో కారణమైంది. 100 మార్కును దాటడంపై ట్రంప్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘‘కొన్ని సందర్భాల్లో మనం భారీ మూల్యం చెల్లించుకుంటాం. ఇప్పుడు ప్రపంచశాంతి కోసం చేసే యుద్ధం వేళ అన్ని దేశాలూ ఇలాంటి చిన్న చిన్న మూల్యాలను చెల్లించాల్సిందే. ఇరాన్‌ సంక్షోభం ముగిసిన వెంటనే ధరలు మళ్లీ ఉన్నపళంగా కిందకు దిగొస్తాయి. తెలివితక్కువ వాళ్లు మాత్రమే ఈ విషయాన్ని విభిన్నంగా ఆలోచిస్తారు’’అని వ్యాఖ్యానించారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement