బంగారంపై భారీ డిస్కౌంట్‌.. అమ్మేసుకుంటున్న వ్యాపారులు | Gold Stranded in Dubai Sold at Discount | Sakshi
Sakshi News home page

బంగారంపై భారీ డిస్కౌంట్‌.. అమ్మేసుకుంటున్న వ్యాపారులు

Mar 6 2026 5:43 PM | Updated on Mar 7 2026 12:34 PM

Gold Stranded in Dubai Sold at Discount

మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో దుబాయ్‌లో బంగారాన్ని భారీ తగ్గింపుతో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమవడంతో, కీలకమైన బులియన్ ట్రేడింగ్ హబ్ అయిన దుబాయ్ నుంచి బంగారం సరఫరా దెబ్బతింది.

విమానాలపై ఆంక్షలు, పెరిగిన షిప్పింగ్, బీమా ఖర్చుల నేపథ్యంలో చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వెంటనే డెలివరీకి హామీ లేకపోవడంతో అదనపు ఖర్చులు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో నిల్వ, నిధుల ఖర్చులను భరించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారులు లండన్ గ్లోబల్ బెంచ్‌మార్క్ ధరతో పోలిస్తే ఔన్స్‌కు సుమారు 30 డాలర్ల వరకు తగ్గింపుతో బంగారాన్ని అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

ఈ వారం మధ్య నుంచి కొంతమేర బంగారం విమానాల్లో లోడ్ చేసి దుబాయ్ నుంచి పంపించినప్పటికీ, శుక్రవారం నాటికి చాలా సరుకు రవాణా ఆలస్యమైందని ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ముఖ్యంగా దుబాయ్.. ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్‌, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతుంది. అయితే టెహ్రాన్‌కు,  అమెరికా-ఇజ్రాయెల్‌కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది.
ఇది చదివారా? 👉 స్తంభించిన దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌!

సాధారణంగా బంగారాన్ని ప్రయాణికుల విమానాల కార్గో విభాగాల్లో తరలిస్తారు. ప్రస్తుతం యూఏఈ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. అయితే భూసరిహద్దులు దాటేటప్పుడు భద్రతా సమస్యలు ఉండటంతో సౌదీ అరేబియా లేదా ఒమాన్ విమానాశ్రయాలకు భూభాగం మీదుగా అధిక విలువ గల సరుకులను తరలించడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement