పరీక్షలకు వెళుతుండగా అక్కా, తమ్ముళ్లను కర్రలతో కొట్టి హత్య
స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత, పోలీసు బలగాల మోహరింపు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీహోర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బోర్డ్ ఎగ్జామ్స్‌కు వెళ్తున్న ఇద్దరు తోబుట్టువులను వారి సొంత బాబాయే దారుణంగా కొట్టి చంపాడు. అక్కా తమ్ముళ్లు శీతల్ (20), కుల్దీప్ (18) తమ అడ్మిట్ కార్డులతో పరీక్షా కేంద్రం వైపు నడుచుకుంటూ వెళుతుండగా కాపుకాసి అత్యంత పాశవికంగా వారిని కొట్టి చంపాడు. రక్తపు మడుగులో వారి మృతదేహాలు ఒక పక్క, వారి అడ్మిట్ కార్డులు ఒకపక్క పడిపోయిన ఘటన పలువురి కంట కన్నీరు తెప్పించింది. ఈ జంట హత్యలు తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:
పోలీసులు అందించిన సమాచాం ప్రకారం ఇది ఆవేశపూరితంగా జరిగిన హత్యలు కావు. పాతకక్షలతో ప్లాన్ చేసిన మరి వారసులను హతమార్చిన దుర్మార్గ ఘటన ఇది.
పిల్లలిద్దరూ ఉదయాన్నే పరీక్షకు వెళ్తారని తెలిసి, నిందితుడు, బాబాయి హరిసింగ్ మాలవీయ రోడ్డుపై కాపు కాశాడు. మార్గమధ్యలో కర్రతో బలంగా తలలపై బాదడంతో వారిద్దరూ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.సీహోర్ జిల్లా ధరంపురి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇదీ చదవండి: రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్
కుటుంబ కలహాలే కారణమని మృతుల తండ్రి జగదీష్ మాలవీయ ఆరోపించారు. తమ ఇంటి దీపాలను ఆర్పేశాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి ఎదుగుతారనుకున్న పిల్లలు, ఇలా సొంత బాబాయి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి : కెనడాలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య
మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధీఖ్‌గంజ్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారైన నిందితుడు హరిసింగ్ కోసం పోలీసులు అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.అతనిని పట్టుకోవడానికి టీమ్‌లను ఏర్పాటు చేశామని, రహస్య ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తున్నట్లు ఎఎస్‌పీ సునీతా రావత్ తెలిపారు.
గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని స్టేషన్ ఇన్‌చార్జ్ రాజు సింగ్ బాఘేల్ తెలిపారు.


