చెన్నై: ‘పాస్ అవ్వడు’ అంటూ 10వ తరగతి విద్యారి్థకి పబ్లిక్ పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించడంతో ఆ ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థి తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసిన సంఘటన కలకలం రేపింది.ç బజనై కోవిల్ వీధికి చెందిన రాధికా అనే మహిళ తన భర్తతో విడిపోయి జీవిస్తోంది. ఆమెకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు కాగలూరు ప్రాంతంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యారి్థకి చర్మవ్యాధి ఉండటంతో అప్పుడప్పుడు సెలవులు తీసుకుని చికిత్స పొందాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను కోలుకున్నాడు.
ఈ పరిస్థితిలో సెలవులు ఎక్కువగా తీసుకున్నాడనే కారణంతో అతనికి జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయకూడదని, రాసినా పాస్ అవడని చెప్పి పాఠశాల అధికారులు పరీక్ష రాయడానికి అనుమతించలేదని తెలుస్తోంది. దీనిపై విద్యార్థి తల్లి రాధికా తిరువళ్లూర్ జిల్లా ప్రధాన విద్యా అధికారికి ఫిర్యాదు పత్రం ఇచ్చారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు విచారణ చేసి, ఆ విద్యార్థికి పబ్లిక్ పరీక్ష రాయడానికి అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాధికా మాట్లాడుతూ, ‘ఇప్పటికే మూడు సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో చదివిన నా కుమార్తె 10వ తరగతి పరీక్షలో ఓ సబ్జక్ట్ లో ఫెయిల్ అయ్యిందని తర్వాత మళ్లీ పరీక్ష రాసి పాస్ అయ్యిందన్నారు. అయినా ఆమెను 11వ తరగతిలో చేర్చడానికి పాఠశాల వారు ఆసక్తి చూపలేదని అందువల్ల ఆమె చదువు కొనసాగించలేదు. ఇప్పుడు నా కుమారుడి పరిస్థితి కూడా అలాగే అవ్వకూడదని నేను ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు.


