తిరువళ్లూరు: బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవల కమిషన్ అధ్యక్షురాలు నళినీదేవి హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురష్కరించుకుని తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు బీడీఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమంతో పాటు రైల్వేస్టేషన్‌కు సమీపంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వేల్‌టెక్ వర్సిటీ న్యాయకళాశాల డీన్ డాక్టర్ వేణుగోపాల్, నళినీదేవి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, ఇబ్బందులపై మరింత అవగాహన అవసరమన్నారు. 18 ఏళ్లలోపు వున్న వారు వివాహం చేసుకుని బిడ్డలకు జన్మనిచ్చినా చట్టం ముందు వారు నిలబడాల్సిందేనన్నారు. చిన్నవయస్సులో వివాహం చేయడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయన్నారు. వేల్‌టెక్ విద్యార్థులు కడంబత్తూరు రైల్వేస్టేషన్ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. కడంబత్తూరు బీడీఓ సౌందరి, జిల్లా చిన్నపిల్లల సంక్షేమ అధికారి మలర్‌విళి, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


