ఇరాన్‌, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన | Russia Key Statement On Iran War | Sakshi
Sakshi News home page

ఇరాన్‌, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన

Mar 6 2026 7:14 AM | Updated on Mar 6 2026 8:42 AM

Russia Key Statement On Iran War

మాస్కో: ఇజ్రాయెల్, అమెరికాలతో పోరాడుతున్నప్పటికీ ఇరాన్‌ తమను సైనిక సాయం అడగలేదని రష్యా ప్రకటించింది. మిత్రదేశానికి సాయపడబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్ష కార్యాలయం అధికారిక ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ గురువారం స్పందించారు. ‘‘ఇరాన్‌ నుంచి ఇంతవరకు ఎలాంటి అభ్యర్థనా రాలేదు. ఇరాన్‌తో మా మిత్రత్వం ఎప్పటి లాగానే కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు లేవు. 2025 జనవరిలో ఇరాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. కానీ ఆ ఒప్పందంలో ఆపత్కాలంలో ఇలాంటి సైనిక సాయం అంశం లేదు’’ అని పెస్కోవ్‌ స్పష్టంచేశారు.

చైనా ఆఫర్‌..
గతవారం నుంచి అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలకు దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. పోరాటాన్ని ముగించడానికి తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. అలాగే, జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యూఏఈకి చైనా మద్దతు ఇస్తుందని, దౌత్యం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకునేలా ఇతర గల్ఫ్ దేశాలకు కూడా మద్దతు ఇస్తుందని వాంగ్ యీ అన్నారు. ‘‘యుద్ధం వల్ల ప్రజలు మాత్రమే నష్టపోతారు.. శాంతి కోసం చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూనే ఉంటుంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శాంతి ప్రక్రియ కోసం ప్రత్యేక రాయబారిని పంపే ప్రణాళికలను ధ్రువీకరించింది.

భారత్‌ కీలక ప్రకటన..
మరోవైపు, ఘర్షణలను వీలైనంత త్వరగా ముగించాలని ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్‌‌లకు భారత్ పిలుపునిచ్చింది. ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత్ చట్టాలను గౌరవిస్తుంది.. సైనిక ఘర్షణలతోనే ఏ సమస్య పరిష్కారం కాదు.. అది ఉక్రెయిన్ అయినా.. పశ్చిమాసియా అయినా’’ అని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement