మార్క్‌ 48.. నిశ్శబ్ద మృత్యువు | Explanation of US Navy MK 48 Heavyweight Torpedo | Sakshi
Sakshi News home page

మార్క్‌ 48.. నిశ్శబ్ద మృత్యువు

Mar 6 2026 6:25 AM | Updated on Mar 6 2026 6:25 AM

Explanation of US Navy MK 48 Heavyweight Torpedo

శ్రీలంక సమీపంలో ఇరాన్‌ యుద్ధనౌకను జలసమాధి చేసింది ఈ టోర్పెడోనే 

వందల కిలోల వార్‌హెడ్‌తో దాడిచేసే సామర్థ్యం 

రెండో ప్రపంచయుద్ధం తర్వాత తొలిసారిగా ఉపయోగించిన అమెరికా

అమెరికా నావికాదళం అమ్ములపొదిలోని మరో సముద్రగర్భ అస్త్రం విశేషాలు తాజాగా ఇరాన్‌ యుద్ధనౌకపై దాడి ఘటనతో వెలుగులోకి వచ్చాయి. దాని పేరు మార్క్‌48. జలాంతర్గామి నుంచి ప్రయోగించి ఈ టోర్పెడోకు అమెరికా నావికాదళం ‘మార్క్‌ 48’అనే పేరుపెట్టింది. ఇరాన్‌కు చెందిన ‘ఐఆర్‌ఐఎస్‌ దేనా’యుద్ధనౌకను కూల్చడం ద్వారా రెండో ప్రపంచయుద్ధం తర్వాత తొలిసారిగా ఒక శత్రునౌకను టోర్పెడోతో జలసమాధి చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ప్రకటించడంతో ఇప్పుడు మార్క్‌48పై చర్చ మొదలైంది. 

దశాబ్దాలుగా నిశ్శబ్ద సేవ.. 
→ అమెరికా నేవీ అ«దీనంలో సేవలందించే జలాంతర్గాముల్లో ప్రస్తుతం మార్క్‌ 48 టోర్పెడోలను ఉపయోగిస్తున్నారు. తొలిసారిగా 1972లో దీనిని తయారుచేశారు. తర్వాత పలుమార్లు నవీకరించారు.  

→ ఇప్పుడు మార్క్‌48 ఏడీక్యాప్‌(అడ్వాన్స్‌డ్‌ కేపబిలిటీ) వేరియంట్‌ను వాడుతున్నారు. ఇందులో ఆధునీకరించిన ఎల్రక్టానిక్, గైడెడ్, ప్రొపల్షన్‌ వ్యవస్థలు ఉన్నాయి.  

→ ఒక్కో టోర్పెడో 21 అడుగుల చుట్టుకొలతతో 19 అడుగుల పొడవు ఉంటుంది. దీని బరువు ఏకంగా 1,700 కేజీలు. యాక్టివ్, పాసివ్‌ సోనార్‌లతో ఇది పనిచేస్తుంది.  

→ ఆగి ఉన్న యుద్ధనౌకతోపాటు వేగంగా వెళ్తున్న యుద్ధనౌకలను ఇది లక్ష్యంగా చేసుకుని గురిచూసి పేల్చేయగలదు. 

→ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎలాంటి శబ్దం లేకుండా దూసుకెళ్లడం దీని ప్రత్యేకత. ఒక్కో టోర్పెడో తయారీకి రూ.38.48 కోట్లు ఖర్చవుతుంది.  

→ శత్రువుల నౌకలను ఎదురుగా ‘హల్‌’భాగాన్ని ఢీకొట్టకుండా అడుగు భాగానికి వెళ్లి ఢీకొట్టి పేలిపోతుంది. దీంతో నౌకఅడుగుకు భారీ రంధ్రం పడుతుంది లేదా ముక్కలు చెక్కలు అవుతుంది. దీంతో నౌక వేగంగా సముద్రజలాల్లో మునిగిపోతుంది. భారీ మందుగుండు పేలడంతో నౌక అడుగున ఒక పెద్ద గాలిబుడగ ఏర్పడుతుంది. దీంతో నౌక మరింత వేగంగా మునిగిపోతుంది. ఒకవేళ పాక్షికంగా దెబ్బతిన్నా కీలక వ్యవస్థలు విఫలంకావడంతో ఎదురుదాడి చేయలేక చేతులెత్తేస్తుంది.. 

→ గైడెన్స్‌ వైర్‌తో ఇది అనుసంధానమై ముందుకు దూసుకుపోతుంది. ఒకవేళ వైర్‌ తెగిపోయినా ఆటోమోడ్‌లో పనిచేస్తూ పని చక్కబెడుతుంది. డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్, అల్గారిథమ్‌లతో ఇది పనిచేస్తుంది. అత్యంత లోతైన, సంక్లిష్టమైన సముద్ర జలాల్లోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది 

→ అమెరికా నావికాదళంలోని లాస్‌ ఏంజెలెస్, సీఊల్ఫ్, ఒహాయో, వర్జీనియా తరగతి బాలిస్టిక్‌ మిస్సైల్‌ జలాంతర్గాముల్లోనూ ఈ టోర్పెడోలను అమర్చారు 

→ యుద్ధనౌకలతోపాటు శత్రుదేశ జలాంతర్గాములను వెంటాడి దాడిచేయగలదు 

→ ‘శ్రీలంక సమీప సముద్రజలాల్లో ఉన్న ఇరాన్‌ యుద్ధనౌకపైకి కేవలం ఒక్క టోర్పెడోనే ప్రయోగించాం. భారీ యుద్ధనౌకను జలసమాధి చేయడానికి ఇలాంటి నిశ్శబ్ద మృత్యువు ఇదొక్కటి చాలు’’అని అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ డేన్‌ కెయిన్‌ వ్యాఖ్యానించారంటే దీని సామర్థ్యం ఏమిటో ఇట్టే తెల్సిపోతుంది 

→ ముఖ్యంగా అణుఇంధనంతో నడిచే జలాంతర్గాములను నాశనం చేసేందుకు ఈ టోర్పెడోను డిజైన్‌చేశారు. 

→ సోవియట్‌ రష్యా సాంకేతికతకు దీటుగా ఎంకే37, ఎంకే14, ఎంకే16 టోర్పెడోలను రిప్లేస్‌ చేస్తూ ‘ప్రాజెక్ట్‌ నోబాస్కా’లో భాగంగా దీనిని రూపొందించారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

 

Advertisement
 
Advertisement
Advertisement