అమెరికాకు బుద్ధి చెప్తాం | Iran Accuses US Of Brutal Attack After Warship Dena Sunk In Indian Ocean, More Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికాకు బుద్ధి చెప్తాం

Mar 6 2026 5:53 AM | Updated on Mar 6 2026 11:28 AM

Iran ambassador to india dr. mohammad fatali warnings to us

యుద్ధనౌకను ముంచేయడంపై ఇరాన్‌ రాయబారి హెచ్చరిక

న్యూఢిల్లీ: ఇరాన్‌ యుద్ధ నౌక ‘దేనా’ను హిందూమహా సముద్ర జలాల్లో అమెరికా ముంచేయడంపై భారత్‌లో ఆ దేశ రాయబారి మహ్మద్‌ ఫతాలీ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా పాల్పడిన చర్య దారుణ హత్యతో సమానమని, ఇరాన్‌ తగు రీతిలో బదులు తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. శాంతియుత విన్యాసాల్లో పాల్గొని తిరిగి వస్తున్న నిరాయుధంగా వస్తున్న నౌకను ధ్వంసం చేయడాన్ని బట్టి చూస్తే అమెరికా, జియోనిస్టులకు అంతర్జాతీయ చట్టాలను నాశనం చేయాలనే దుర్భుద్ధి ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. మా ప్రజలు, ఆత్మవిశ్వాసాన్నే నమ్ముకున్న మా దేశం ఈ చర్యకు తీవ్రమైన రీతిలో సమాధానమిస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్, భారత్‌ల మధ్య బలమైన సంబంధాలు, ఉమ్మడి ప్రయోజనాలు, బలమైన సాంస్కృతిక వారసత్వం ఉన్నాయన్నారు.

హెచ్చరిక లేకుండానే దాడి
యుద్ధ నౌక దేనాపై అమెరికా సబ్‌మెరీన్‌ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఆకస్మికంగా టార్పెడో దాడి చేసిందని ముంబైలో ఇరాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ సయీద్‌ రెజా అన్నారు. నౌకా విన్యాసాల నుంచి తిరిగి వెళ్లే యుద్ధ నౌకల్లో సాధారణంగా ఎటువంటి మందుగుండు సామగ్రి ఉందన్నారు. ఒకవేళ ఉన్నా దానిని విన్యాసాల సమయంలో ఉపయోగించే అవకాశం తక్కువని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రిగేట్‌ దేనాను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు. ఈ ఘటనలో 100 మంది వరకు నౌకా సిబ్బంది, సైనికులు వీరమరణం పొందడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులను రోడ్డు మార్గంలో స్వదేశానికి తరలించేందుకు నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

అన్వేషణలో శ్రీలంకకు తోడుగా..
అమెరికా టార్పెడో దాడిలో హిందూ మహా సముద్రంలో మునిగిన ఇరాన్‌ యుద్ధ నౌక వద్ద అన్వేషణ, సహాయ కార్యక్రమాల్లో శ్రీలంకకు భారత్‌ తోడైంది. లాంగ్‌ రేంజ్‌ పెట్రోల్‌ విమానం సాయంతో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు నేవీ తెలిపింది. ఆ ప్రాంతంలోనే మోహరించి ఉన్న ఐఎన్‌ఎస్‌ తరంగిణి కూడా అన్వేషణలో పాల్గొంటోందని పేర్కొంది. ఐఎన్‌ఎస్‌ ఇక్షక్‌ కూడా కొచ్చినుంచి బయలుదేరిందని వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement