తొలిసారిగా డిజిటల్‌ జనగణన | The Center is ready for the prestigious census | Sakshi
Sakshi News home page

తొలిసారిగా డిజిటల్‌ జనగణన

Mar 6 2026 4:40 AM | Updated on Mar 6 2026 4:40 AM

The Center is ready for the prestigious census

యాప్, మస్కట్‌లను ఆవిష్కరించిన అమిత్‌ షా 

రెండు దశల్లో భారీ కసరత్తు..

బరిలో 30 లక్షల మంది సిబ్బంది 

16 భాషల్లో ఆన్‌లైన్‌లో స్వీయ నమోదుకు అవకాశం 

రెండో దశలో 2027 మార్చి ఒకటి నుంచి కులగణన

సాక్షి, న్యూఢిల్లీ: దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మక జనాభా లెక్కల (సెన్సస్‌–2027) సేకరణకు కేంద్రం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్యుమరేషన్‌ ప్రక్రియను తొలిసారిగా పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలో నిర్వహించనుంది. ఇందుకోసం రూపొందించిన నాలుగు అత్యాధునిక డిజిటల్‌ యాప్‌లు, పోర్టల్స్‌తో పాటు ‘ప్రగతి’, ‘వికాస్‌’అనే మస్కట్‌లను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఢిల్లీలో గురువారం లాంఛనంగా ఆవిష్కరించారు. 

టెక్నాలజీతో సులభంగా ఇంటింటి సర్వే 
సుమారు 30 లక్షల మంది సిబ్బందితో ఈ బృహత్తర కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టనుంది. కాగితాలతో పనిలేకుండా, సీ–డాక్‌ ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌ల ద్వారా ఆఫ్‌లైన్‌లోనూ సిబ్బంది డేటాను సేకరిస్తారు. ఈసారి ప్రజలకు ‘సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌’(స్వీయ నమోదు) సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఎన్యుమరేటర్‌ ఇంటికి రాకముందే, ప్రజలు తమ స్మార్ట్‌ ఫోన్ల ద్వారా 16 ప్రాంతీయ భాషల్లో కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇలా చేయగానే వచ్చే ప్రత్యేక ఐడీని సిబ్బందికి చూపిస్తే సరిపోతుంది. 

ఆకర్షణీయంగా ‘ప్రగతి’, ‘వికాస్‌’:  
జనగణన ప్రక్రియలో స్త్రీ, పురుషుల సమాన భాగస్వామ్యానికి ప్రతీకగా మహిళా ఎన్యుమరేటర్‌ను ’ప్రగతి’గా, పురుష ఎన్యుమరేటర్‌ను ’వికాస్‌’గా నామకరణం చేస్తూ మస్కట్‌లను విడుదల చేశారు. 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని ప్రభుత్వం తెలిపింది. 

నాలుగు కీలక సాధనాలు ఇవే.. : 
హౌస్‌లిస్టింగ్‌ వెబ్‌ యాప్‌: శాటిలైట్‌ మ్యాప్‌ల ద్వారా భౌగోళికంగా డిజిటల్‌ బ్లాక్‌ల రూపకల్పనకు ఇది ఉపయోగపడుతుంది. 
హెచ్‌ఎల్‌ఓ యాప్‌: ఎన్యుమరేటర్లు నేరుగా డేటాను సర్వర్‌కు పంపేందుకు ఈ ఆఫ్‌లైన్‌ మొబైల్‌ యాప్‌ ఉపకరిస్తుంది. 
స్వీయ నమోదు పోర్టల్‌ (ఎస్‌ఈ పోర్టల్‌ ): ప్రజలు నేరుగా తమ వివరాలు నమోదు చేసుకునే వెబ్‌సైట్‌. 
సెన్సస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌: అధికారులంతా ఎప్పటికప్పుడు సర్వే పురోగతిని పర్యవేక్షించే రియల్‌–టైం డ్యాష్‌బోర్డ్‌. 

రెండు దశల్లో సెన్సస్‌.. కులగణన కూడా : 
జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. ఇళ్ల వివరాలు సేకరించే మొదటి దశ (హౌస్‌ లిస్టింగ్‌) 2026 ఏప్రిల్‌ 1 నుంచి సెపె్టంబర్‌ 30 మధ్య రాష్ట్రాల వెసులుబాటును బట్టి 30 రోజుల పాటు జరుగుతుంది. వ్యక్తుల వివరాలు సేకరించే రెండో దశ (జనాభా లెక్కింపు) 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 

విశేషమేమిటంటే, ఈ రెండో దశలోనే కులగణన వివరాలు కూడా సేకరిస్తారు. ఈ జనాభా లెక్కలకు 2027 మార్చి 1వ తేదీని ప్రామాణిక తేదీగా నిర్ణయించారు. మంచు ప్రభావం ఉండే ప్రాంతాల్లో (లద్దాఖ్, జమ్మూకశీ్మర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌) మాత్రం 2026 సెపె్టంబర్‌కల్లా ఈ సర్వేను పూర్తి చేస్తారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement