ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్‌ | India Offers Condolences Over Khamenei Death | Sakshi
Sakshi News home page

ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్‌

Mar 5 2026 4:50 PM | Updated on Mar 5 2026 5:13 PM

India Offers Condolences Over Khamenei Death

ఢిల్లీ: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్‌ తొలిసారి స్పందించింది. ఖమేనీ మృతిపట్ల ఇండియా సంతాపం తెలిపింది. ఢిల్లీలోని ఇరాన్‌ ఎంబసీకి వెళ్లిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. సంతాప సందేశం రాశారు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ మరణించడం తెలిసిందే.

శత్రు దుర్భేద్యమైన భద్రత కలిగిన అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించడం సంచలనం సృష్టించింది. ఖమేనీ కోసం కొన్ని నెలలపాటు కొనసాగిన వేట చివరకు రెండు గంటల ఐదు నిమిషాల ఆపరేషన్‌తో ముగిసింది. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతోనే ఆయనను అంతం చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు ఏకంగా 30 క్షిపణులను ప్రయోగించాయి. దాంతో ఆయన తప్పించుకోలేకపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తమ హిట్‌లిస్ట్‌లో ఉన్న ఖమేనీపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది.

ఖమేనీతో జరిగిన భేటీకి ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కాప్స్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మొహమ్మద్‌ పాక్‌పౌర్, రక్షణ శాఖ మంత్రి అజీజ్‌ నజీర్‌జాదే, మిలటరీ కౌన్సిల్‌ అధినేత అడ్మిరల్‌ అలీ షామ్‌ఖనీ, ఐఆర్‌జీసీ ఏరోస్పేస్‌ ఫోర్స్‌ కమాండర్‌ సయ్యద్‌ మాజిద్‌ మౌసావీ, డిప్యూటీ ఇంటెలిజెన్స్‌ మంత్రి మొహమ్మద్‌ షిరాజీతోపాటు మరికొందరు ముఖ్యులు హాజరయ్యారు. ఇజ్రాయెల్‌ క్షిపణి దాడుల్లో వీరంతా హతమయ్యారు. ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే మృతి చెందారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement