నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన అలెగ్జాండర్ స్టబ్
న్యూఢిల్లీ: భారత్‌లో నాలుగు రోజుల పర్యటనకు గాను ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఢిల్లీకి చేరుకున్న ఆయనకు విమానా శ్రయంలో విదేశాంగ శాఖ సహాయమంత్రి కృతి వర్థన్‌సింగ్ స్వాగతం పలికారు. స్టబ్ గురువారం ప్రధాని మోదీతో సమావేశ మవుతారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశాలున్నాయి.
గురువారం సాయంత్రం ప్రారంభమయ్యే రైజినా డైలాగ్ సదస్సులో స్టబ్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసమిస్తారు. స్టబ్ వెంట మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపార వేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వచ్చింది. అలెగ్జాండర్ స్టబ్ రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌లతోనూ భేటీ అవుతారు. శుక్రవారం ముంబైలో వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. శనివారం తిరిగి స్వదేశానికి పయనమవుతారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఓర్పో పాల్గొనడం తెల్సిందే. కొన్ని వారాల వ్యవధిలోనే ఆ దేశాధ్యక్షుడు కూడా భారత్ రావడం గమనార్హం.


