పశ్చిమాసియాలో చస్తే యుద్ధం చేయబోం
యుద్ధం కోసం మా స్థావరాలను అమెరికాకు ఇచ్చే ప్రసక్తే లేదు
తెగేసి చెప్పిన స్పెయిన్ ప్రధాని పెడ్రో
దేశీయ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ
మాడ్రిడ్: ఇరాన్‌పై దాడుల కోసం మీ వైమానిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతించాలని లేదంటే వాణిజ్య బంధం తెంచుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాన్‌చెజ్ బేఖాతరు చేశారు. బెదిరింపులకు లొంగే ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు. అర్ధంలేని యుద్ధంలో భాగస్వాములం కాబోమని స్పష్టంచేశారు. వాణిజ్య బంధాన్ని వదులుకుంటామని ట్రంప్ చేసిన హెచ్చరికలపై పెడ్రో దీటుగా స్పందించారు.
బుధవారం టెలివిజన్‌లో దేశ ప్రజలనుద్దేశించి పెడ్రో ప్రసంగించారు. ‘‘ప్ర పంచానికి అశుభంగా దాపురించిన పశ్చి మాసియా యుద్ధంలోకి మేం దిగదల్చు కోలేదు. ఈ సమరం అనేది మా దేశ విలు వలు, స్వ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధం. ట్రంప్ హెచ్చరికలకు బెదిరిపోయే వాళ్లు ఎవరూ లేరిక్కడ. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ అన్యాయంగా దాడులు చేస్తున్నాయి. ఇతర దేశాల వ్యవహారల్లోకి సైనిక జోక్యం చేసుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం. ఇరాన్‌పై దాడులతో పశ్చిమాసియాలో అత్యంత భీకరమైన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే పెను ప్రమాదం పొంచి ఉంది’’అని ఆయన అన్నారు.
బుల్లెట్ ఎప్పుడు పేలుతుందో తెలీదు..
‘‘ఇరాక్, అఫ్గానిస్తాన్ విషయాల్లో అమెరికా జోక్యం చేసుకున్నప్పుడూ ప్రపంచం దారుణ విపరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధంలో భాగస్వాములుకావడం అంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లే. రివాల్వర్‌లో ఒక బుల్లెట్ పెట్టి బుల్లెట్ చాంబర్ గిరగిరా తిప్పి కాల్చడం లాంటిది. బుల్లెట్ ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలీదు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఏ దారుణ దిశగా వెళ్తుందో, ఎలాంటి విషాదాలను మిగుల్చుతుందో ఎవరూ ఊహించలేరు. తాజా పరిణామాలపై స్పెయిన్ ప్రభుత్వ వైఖరిని నాలుగు ముక్కల్లో చెప్పాలంటే మేం యుద్ధం అస్సలు చేయదల్చుకోలేదు’’ అని ఆయన స్పష్టంచేశారు.
దక్షిణ స్పెయిన్‌లోని రోటా, మొరాన్ స్థావరాలను ఎప్పుడంటే అప్పుడు మేం వినియోగించుకోగలమని మంగళవారం ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘ ఈ స్థావరాలను ఉపయోగించకూడదు అని మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు’’ అని ట్రంప్ అన్నారు. యుద్ధంలో భాగస్వాములు కాకపోతే అత్యధిక టారిఫ్‌ల మోత, పరస్పర వాణిజ్యంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించడం తెల్సిందే. ట్రంప్ వ్యాఖ్యలపై స్పెయిన్ ఆర్థిక మంత్రి కార్లోస్ క్యూయెర్పో స్పందించారు. ‘‘ ప్రశాంతంగా ఉండాలని ట్రంప్‌కు సందేశం పంపిస్తా.
ట్రంప్ బెదిరింపులకు దిగుతారుగానీ ఆచరణలో ఏమీ ఉండదు’’ అని కార్లోస్ ఎద్దేవాచేశారు. అమెరికాతో స్పెయిన్ ఎగుమతి, దిగుమతుల విలువ దేశ జీడీపీలో కేవలం 4.4 శాతానికి సమానం. స్పెయిన్‌కు ఆరో అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా అమెరికా కొనసాగుతోంది. నాటో దేశాలు తమ జీడీపీలో 5 శాతానికి సమానమైన నిధులను రక్షణ బడ్జెట్ కోసం కేటాయించాలంటూ గతంలో అమెరికా చేసిన ప్రతిపాదననూ స్పెయిన్ ఆనాడే తీవ్రంగా తప్పుబట్టింది. బడ్జెట్ కేటాయింపులు ఏ మేరకు ఉండాలనేది తమ సొంత విషయమని తెగేసి చెప్పింది. దీంతో అధిక టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ ఆనాడే స్పెయిన్‌ను బెదిరించారు.


