యుద్ధ దేవతలు | Indian nurses are lifeline in a crisis | Sakshi
Sakshi News home page

యుద్ధ దేవతలు

Mar 5 2026 3:14 AM | Updated on Mar 5 2026 3:14 AM

Indian nurses are lifeline in a crisis

సంక్షోభంలో ప్రాణబాంధవులు 

ధీశాలులు.. భారతీయ నర్సులు!

దశాబ్దాలుగా, పశ్చిమాసియాలోని ఆరోగ్య వ్యవస్థకు భారతీయ నర్సులు వెన్నెముకలా నిలుస్తున్నారు. ‘ఏంజెల్స్‌ ఇన్‌ వైట్‌’గా మన్ననలు పొందుతున్నారు. 1990ల నాటి కువైట్‌ యుద్ధం నుండి తాజా ఇరాన్‌ యుద్ధం వరకు.. వైద్య చికిత్సలు, ఆరోగ్య సేవలు అందించటంలో మన నర్సులు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.     – సాక్షి స్పెషల్‌ డెస్క్‌

నర్సులదీ ‘పోరాటమే’!
ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఇరాన్‌ యుద్ధం’లో భారతీయ నర్సులు స్థిరచిత్తంతో నిర్భయంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు సైనికుల్లా పోరాడుతున్నారు. అక్కడ వారు చేస్తున్నది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, గొప్ప మానవతా సేవ కూడా.

కేరళ నర్సులే ఎక్కువ
పశ్చిమ ఆసియాలో నర్సులుగా పనిచేస్తున్న భారతీయ మహిళల సంఖ్య గణనీయంగా ఉంది. వారిలో ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి వెళ్లిన వారు ఉన్నప్పటికీ, ఎక్కువ మంది కేరళ రాష్ట్రానికి చెందినవారే.

యుద్ధంలోనూ సంసిద్ధం
తాజా యుద్ధంలో భారతీయ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు ఎంతో ధైర్యంగా, నిలకడగా గాయపడినవారికి వైద్యసేవలు అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యుద్ధానికి నేరుగా సంబంధం లేని దేశాలలో సైతం ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులలో కూడా మన నర్సులు ఆరోగ్య సేవలకు సంసిద్ధమై ఉన్నారు.

దృఢ సంకల్పానికి నిదర్శనం
సంక్షోభ సమయాలలో ఎవరి దేశానికి వాళ్లు వెళ్లిపోయేందుకు తొందరపడుతున్నా భారతీయ నర్సులకు మాత్రం అక్కడేఉండి సేవలు అందించినఘన చరిత్ర ఉంది. పశ్చిమ ఆసియాలో గతంలో సంభవించిన ఎన్నో ప్రధాన సంక్షోభాల సమయంలో వారి ఉనికి ఎంతో కీలకంగా నిలిచింది.

ప్రాణాలకు తెగించి సేవలు
కువైట్, ఇరాక్‌ వంటి యుద్ధ క్షేత్రాలలో బాంబు దాడులు,  క్షిపణి ముప్పులు పొంచి ఉన్నప్పటికీ, భారతీయ నర్సులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందించిన మహోన్నత చరిత్ర ఉంది.

వైద్య వ్యవస్థకు వెన్నెముక
యుద్ధం కారణంగా స్థానిక వైద్యులు, సిబ్బంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు, భారతీయ నర్సులు అక్కడే 
ఉండి ఆసుపత్రులు మూతపడకుండావైద్య వ్యవస్థను నిలబెట్టారు.

అంతర్జాతీయ గుర్తింపు
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పనిచేసే ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌’ గా భారతీయ నర్సులు (ముఖ్యంగా కేరళకు చెందిన వారు) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.

మానవతా దృక్పథం
రాజకీయ అశాంతి, అంతర్యుద్ధాల సమయంలో పౌరులకు, గాయపడిన సైనికులకు ఎటువంటి వివక్ష లేకుండా నిరంతరాయంగా చికిత్స అందించడంలో మనవాళ్లు కీలక పాత్ర పోషించారు.

సంక్షోభ నిర్వహణ
పరిమిత వనరులు, మందుల కొరత ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందిస్తూ వేలాది మంది ప్రాణాలను కాపాడటంలో భారతీయ నర్సులు అసమాన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.  

Advertisement
 
Advertisement
Advertisement