ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను ఎన్నుకున్నారన్న ప్రచారం ఉత్తిదేనా? | Iran denies reports of appointment of later Khamenei's successor | Sakshi
Sakshi News home page

మా సుప్రీం లీడర్‌ను ఎన్నుకోలేదు: స్పష్టం చేసిన ఇరాన్‌

Mar 4 2026 4:11 PM | Updated on Mar 4 2026 4:50 PM

Iran denies reports of appointment of later Khamenei's successor

టెహ్రాన్‌: ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ (అలీ ఖమేనీ కుమారుడు)ని ఎన్నుకున్నారంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ద్వారా ఆ దేశ ప్రభుత్వం ఖండించింది.

“దేశానికి నాయకత్వం వహించే సామర్థ‍్యం ఉన్న అభ్యర్థులను ఇరాన్ అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఎంపిక చేసిందని మీడియాలో ప్రచారం అవుతున్న నివేదికలకు ఏ ఆధారాలూ లేవు. వాటిని అధికారికంగా ఖండిస్తున్నాం” అని ఎక్స్‌లో ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ తెలిపింది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌​గా ఎవరిని ఎన్నుకున్నా, అతడిని టార్గెట్‌ చేస్తామంటూ ఇజ్రాయెల్ ఇవాళ ఉదయమే హెచ్చరించిన విషయం తెలిసిందే.

కాగా, మొజ్తాబాకు వారసుడిగా అలీ ఖమేనీని ఎన్నుకున్నారని, సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొంది. కొన్ని గంటల్లోనే ఇరాన్ అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ మొజ్తాబా ఖమేనీని వారసుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పింది.

మొజ్తాబా తన దివంగత తండ్రి అలీ ఖమేనీ కార్యాలయ నిర్వహణలో కీలక పాత్ర పోషించారని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉన్నత వర్గం, ఖుద్స్ దళంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొంది. మొజ్తాబా తన తండ్రి కంటే కఠిన వైఖరితో ఉంటారని తెలిపింది. 

ఇరాన్‌లో నిరసనకారులపై జరిగిన హింస, అణచివేతల వెనుక మొజ్తాబా పాత్ర ఉందని వివరించింది. 2019 నవంబర్‌లో అమెరికా ట్రెజరీ విభాగం మొజ్తాబాపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వంలో ఏ పదవీ లేకపోయినప్పటికీ సుప్రీం నాయకుడి తరఫున అధికారిక ప్రతినిధిగా వ్యవహరించినందుకు అతడిని గుర్తించింది.

మరోవైపు, ఇరాన్ మీడియా ప్రకారం.. ఇరానీయులు దివంగత సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ పార్థివ దేహానికి ఇవాళ రాత్రి టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ ప్రార్థనా మైదానంలో జరిగే కార్యక్రమంలో తుది వీడ్కోలు పలుకనున్నారు. ఈ కార్యక్రమం మూడు రోజులు కొనసాగుతుంది, అంతిమయాత్ర తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇరాన్‌ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ప్రతీకారంతో ఇరాన్‌పై బాంబులతో దాడి చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ ఆరోపించారు.

వైట్ హౌస్‌లో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. “మేము చర్యలు చేపట్టకపోతే, అణుయుద్ధం జరిగేది. వారు అనేక దేశాలను నాశనం చేసేవారు. వారి మనస్తత్వం సరిగ్గాలేదు, కోపంతో ఉన్నారు, వారు పిచ్చివాళ్లు. వారి వద్ద అణ్వాయుధం ఉంటే ప్రయోగించేవారు” అని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement