ఇరాన్ దాడుల వెనుక చైనా రహస్య సాయం! | Is there a Chinese secret behind Iran's deadly missile and drone arsenal | Sakshi
Sakshi News home page

ఇరాన్ వద్ద భారీగా క్షిపణులు, డ్రోన్లు.. రహస్యంగా చైనా సాయం!

Mar 4 2026 2:53 PM | Updated on Mar 4 2026 3:07 PM

Is there a Chinese secret behind Iran's deadly missile and drone arsenal

టెహ్రాన్‌: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారని పేర్కొన్న తర్వాత పశ్చిమాసియాలోని లక్ష్యాలపై ఇరాన్ భీకరంగా దాడులు చేస్తోంది. ఇరాన్‌ దాడులు కొనసాగిస్తున్న తీరును చూస్తే ఆ దేశం వద్ద అతి భారీగా క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంత భారీ ఎత్తున ఇరాన్‌ దాడులు చేస్తుండడానికి కారణం దశాబ్దాలుగా ఆ దేశం నిర్మించుకున్న ఆయుధాగారం. ఇరాన్‌ ఇంతగా క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడం వెనుక చైనా ఉందా? డ్రాగన్‌ దేశం ఆయుధాలు సరఫరా చేసిందా? సాంకేతిక సాయం అందించిందా?

ఇరాన్ ఆయుధాలు కేవలం ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులనే కాదు.. యూఏఈ, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా సహా దాదాపు 10 దేశాల్లోని లక్ష్యాలను తాకాయి.  దీంతో ఇరాన్‌ పెద‍్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లను నిల్వ చేసుకుందన్న విషయం స్పష్టమవుతోంది. షాహీద్ క్లాస్‌ కమికాజే డ్రోన్లు, ఫత్తాహ్ క్లాస్‌ హైపర్సోనిక్ క్షిపణులు వంటివి ఇరాన్ భద్రతా వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఈ ఆయుధాగార అభివృద్ధిలో చైనా పాత్ర గురించి బయటకు వివరాలు అంతగా తెలియవు.

ఓ అంతర్జాతీయ పత్రిక తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు వివరాలను వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు ఇరాన్‌కు చైనా ఆయుధాలు అందించిందని వివరించింది. చైనా తయారీ సీఎం302 యాంటీ షిప్ క్షిపణుల కొనుగోలుపై ఇరాన్-చైనా ఒప్పందం కూడా చేసుకోవాలనుకున్నాయి.

ఇరాన్ ప్రస్తుత ఆయుధాగారంలో అధిక శాతం స్వదేశీ ఉత్పత్తులే ఉన్నప్పటికీ, వాటిలో అనేక సిస్టమ్స్‌ చైనా పాత మోడళ్ల ఆధారితంగా ఉన్నాయని లేదంటే చైనా తయారీ భాగాలపై ఆధారపడి వాటిని ఇరాన్‌ తయారు చేసినట్లుందని విశ్లేషకులు చెప్పారు. ఈ విధంగా దశాబ్దాలుగా ఇరాన్‌ ఆయుధాగార నిర్మాణంలో చైనా పాత్ర ఉంది. చైనా నుంచి పెద్ద ఎత్తున సాయం అందకుండా ఇరాన్ ఈ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని సాధించలేదని అంతర్జాతీయ నిపుణులు అన్నారు.

1979 నుంచే ఆయుధాల సరఫరా షురూ..
ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో 1979-1989 మధ్య ఇరాన్‌ మొదటిసారి చైనా నుంచి ఆయుధాలు పొందింది. పశ్చిమ దేశాలు విధించిన ఆయుధ నిషేధాల మధ్య, 1986లో హై-2, సీ-801 యాంటీ షిప్ వ్యవస్థలను కూడా చైనా సరఫరా చేసింది.  

స్టాక్‌హోమ్ పీస్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. ఇరాన్‌కు చైనా అతిపెద్ద ఆయుధ సరఫరాదారుల్లో ఒకటి. విమానాలు, క్షిపణులు, తుపాకీ వ్యవస్థలు సహా రక్షణ పరికరాలను అందించింది.

అయితే, 2005 సెప్టెంబర్‌లో ఇంటర్నేషనల్‌ ఆటోమిక్‌ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం పాటించలేదని పేర్కొనడంతో చైనా ప్రత్యక్ష ఆయుధ విక్రయాలు ఆపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా అణ‍్వాయుధాలకు సంబంధించిన సాంకేతిక వస్తువుల ఎగుమతి దిగుమతిపై నిషేధం అమలైంది. అమెరికా ఆంక్షలు చైనా ఆయుధ విక్రయాలను మరింత నియంత్రించాయి. అమెరికా ఆంక్షలు ఉన్న దేశాలకు చైనా సాధారణంగా ఆయుధాలు విక్రయించదు.

చైనా ఇంకా ఎలా సాయపడింది?
ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల నిల్వలు, ఫత్తాహ్ బాలిస్టిక్ క్షిపణులు, షాహీద్ కమికాజే డ్రోన్లలో అధిక శాతం ఇరాన్‌ స్వదేశీ పరిశోధన ఫలితాల ఆధారంగా అభివృద్ధి చేసుకుంది. నూర్, ఖద్ర్, నస్ర్ క్లాసెస్‌, సీ-802 వంటివి చైనా సిస్టమ్స్‌ ఆధారంగా ఇరాన్‌ ఉత్పత్తి చేసుకుంది.

అయినా చైనా ప్రత్యక్ష విక్రయాలకన్నా ద్వంద్వ వినియోగ (డ్యూయల్‌ యూజ్‌) భాగాలు సరఫరా చేస్తోంది. మైక్రోచిప్స్, ఎలక్ట్రానిక్ భాగాలు, నావిగేషన్ వ్యవస్థలు వంటి పౌర వినియోగ వస్తువులు సైనిక పరికరాల్లో అమర్చవచ్చు. ద్వంద్వ వినియోగ సాంకేతికత అంటే పౌర ప్రయోజనాలకూ, సైనిక ప్రయోజనాలకూ ఉపయోగపడే సాంకేతిక భాగాలు.

క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ ప్రోగ్రామ్స్‌పై చైనా ప్రోపెల్లెంట్లు, ఎలక్ట్రానిక్ భాగాలు అందించింది. ప్రోపెల్లెంట్ అంటే క్షిపణి నడిపే ఇంధన పదార్థం. 1990 దశక ప్రారంభం నుంచి చైనా బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధిలో నైపుణ్యం, సాంకేతికత, భాగాలు, శిక్షణను ఇరాన్‌కు అందించింది.

అలాగే, ఇరాన్‌కు చైనా సోడియం పెర్‌క్లోరేట్ సరఫరా చేసింది. ఇది అమోనియం పెర్‌క్లోరేట్ తయారీలో ఉపయోగపడుతుంది. అమోనియం పెర్‌క్లోరేట్ అంటే ఘన ఇంధన క్షిపణుల ప్రధాన పదార్థం. 2023 మార్చిలో అమెరికా ఖజానా శాఖ, వేల ఏరోస్పేస్ భాగాలు ఇరాన్ ఎయిర్‌క్రాఫ్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ కంపెనీకి విక్రయించారని ఆరోపిస్తూ చైనా, హాంకాంగ్ కేంద్రంగా ఉన్న 5 కంపెనీలు, ఒక వ్యక్తిని ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది. ప్రతిగా ఇరాన్ చమురును చైనా విస్తారంగా దిగుమతి చేసుకుంటోంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement